వన్డే క్రికెట్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టి అరుదైన ఘనత సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 12 వేల పరుగులు చేసి.. 17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. సచిన్ 300 ఇన్సింగ్స్‌ల్లో 12 వేల పరుగులు చేసి రికార్డు నెలకొల్పితే కేవలం 241 ఇన్సింగ్స్‌ల్లోనే విరాట్ ఆ ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత కెప్టెన్ ఈ ఘనత సాధించాడు.
కోహ్లీ నెలకొల్పిన ఈ రికార్డుపై గంభీర్ స్పందించాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని కోహ్లీ గర్వంగా భావిస్తాడని, దేశం కోసం పరుగులు సాధించడాన్ని ఎంతో ఇష్టపడతాడని గంభీర్ క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో పేర్కొన్నాడు.
"దేశం కోసం ఏదైనా చేయడమే అత్యుత్తమ అనుభూతి. పరుగులు సాధించి, హోటల్ రూంలోకి వచ్చి.. నా దేశం కోసం నా వంతు కృషి చేశానని అనుకున్నప్పుడు వచ్చే ఆ సంతృప్తికి మించిన ఆనందం మరొకటి ఉండదు. కోహ్లీ ఎప్పుడూ అదే సంతృప్తితో ఉంటాడు. దేశం కోసం మొత్తంగా 20 వేల పైచిలుకు పరుగులు, ఎన్నో సెంచరీలు సాధించిన విరాట్‌కు హ్యాట్సాఫ్" అని ప్రశంసించాడు.
భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ పరాజయం చవిచూసింది. మొదటి రెండు వన్డేలు ఓడిపోయిన టీమ్ఇండియా మూడో వన్డేలో నెగ్గి క్లీన్‌స్వీప్‌ను తప్పించుకుంది.