కరోనా విరామం తర్వాత దేశంలో తిరిగి క్రికెట్ సందడి మొదలు కానుంది. దేశవాళీ ప్రధాన టీ20 టోర్నీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ఆదివారమే తెరలేవనుంది. ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు.. వచ్చే నెలలో ఆటగాళ్ల వేలం ఉండబోతున్న నేపథ్యంలో.. ఈ టోర్నీలో సత్తాచాటి ఫ్రాంఛైజీల దృష్టిలో పడాలనే పట్టుదలతో ఉన్న కుర్రాళ్లు సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు ధావన్, ఇషాంత్, భువీ లాంటి సీనియర్ ఆటగాళ్లూ ఫామ్ చాటుకునేందుకు బరిలో దిగుతున్నారు.
వేదికలు..
వైరస్ పరిస్థితుల్లో ప్రత్యేక బబుల్ వాతావరణం ఏర్పాటు చేసి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముంబయి, వడోదర, ఇండోర్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులో జరగనున్నాయి. నాకౌట్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది.
ఎలా జరగుతుందంటే..
38 జట్లను ఆరు (అయిదు ఎలైట్, ఓ ప్లేట్) గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఎలైట్ గ్రూప్- ఎ లో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటక మరోసారి టైటిల్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఎలైట్ గ్రూప్- బిలో ఉన్న హైదరాబాద్ టోర్నీ తొలిరోజు అసోమ్‌తో పోరుతో ప్రయాణం మొదలెట్టనుంది. మరోవైపు ఎలైట్ గ్రూప్- ఈలో అంబటి రాయుడు సారథ్యంలో ఆంధ్ర లీగ్ మ్యాచ్‌లను ముంబయిలో ఆడనుంది.
దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడు అర్జున్ తొలిసారి ముంబయి సీనియర్ జట్టు తరపున ఆడనున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ నిషేధం నుంచి బయటపడి తిరిగి పోటీ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్న 37 ఏళ్ల వెటరన్ పేసర్ శ్రీశాంత్‌కు కేరళ తరపున మ్యాచ్ ఆడే అవకాశం లభిస్తుందేమో చూడాలి.
ఎలాంటి సమస్యలు లేకుండా ఈ టోర్నీని సజావుగా నిర్వహిస్తే మిగతా దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్-14 నిర్వహణకు బీసీసీఐకి మార్గం సుగమమయ్యే వీలుంది.
ఇదీ చూడండి: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ: సై అంటున్న కుర్రాళ్లు