ఐపీఎల్ పాలక మండలికి భారతీయ క్రికెటర్ల సంఘం (ఐసీఏ) ప్రతినిధిగా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా నామినేట్ అయ్యాడు. బీసీసీఐ వార్షిక సమావేశానికి ఒకరోజు ముందు ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. అహ్మదాబాద్‌లో నేడు ఏజీఎం జరగనుంది.
బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం గతేడాది ఐసీఏ నుంచి సురీందర్ ఖన్నాను నామినేట్ చేశారు. ఈసారి ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఏటా ఒక సభ్యుడిని ఐసీఏ నామినేట్ చేయాల్సి ఉంటుంది.
"ఐపీఎల్ పాలక మండలికి ప్రజ్ఞాన్ ఓజాను ప్రతినిధిగా ఐసీఏ డైరెక్టర్లు నామినేట్ చేశారు. గతంలో సురీందర్ ఖన్నా తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని మేం భావిస్తున్నాం" అని ఐసీఏ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా అన్నారు.
టీమ్‌ఇండియా తరఫున ఆడిన ప్రజ్ఞాన్ ఓజా గతేడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2013లో సచిన్ తెందూల్కర్ వీడ్కోలు టెస్టులో అతడు చివరగా ఆడాడు. 2009 నుంచి 2013 వరకు 24 టెస్టులు ఆడిన ఓజా 113 వికెట్లు తీసుకున్నాడు.