గతంలో భారత క్రికెటర్లు వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా ఆడారని సంచలన వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ కెప్టెన్, మాజీ సెలక్టర్ ఇంజమాముల్ హక్. తాను ఆడే రోజుల్లో టీమిండియా, పాకిస్థాన్ ఆటగాళ్లకు చాలా తేడా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత క్రికెటర్లు.. తమ స్థానాలను కాపాడుకునేందుకు ప్రయత్నించేవారని, రికార్డులపైనా దృష్టి పెట్టి బ్యాటింగ్ చేసేవారని చెప్పాడు. పాక్ ఆటగాళ్లు.. రికార్డుల కోసం కాకుండా జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే బరిలోకి దిగేవారని వెల్లడించాడు.
"మేం ఆడేటపుడు టీమిండియా బ్యాటింగ్ మాకంటే బలంగా ఉండేది. అది కాగితంపై పులుల తరహాలో మాత్రమే. అయితే బ్యాట్స్‌మెన్‌గా వారి కంటే మా రికార్డు మెరుగ్గా ఉండేది. మేం ఒక్కొక్కరూ 30-40 పరుగులు చేయాలనుకునేవాళ్లం. అదే భారత జట్టులో ఎవరైనా శతకం చేస్తే అది వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే. మేం మాత్రం జట్టుగా పోరాడేవాళ్లం. మాకు వారికి తేడా అదే" -ఇంజమామూల్ హక్, పాక్ మాజీ కెప్టెన్
అయితే ఇప్పుడు పాక్ క్రికెటర్లు తమ స్థానాల్ని కాపాడుకునేందుకు కుస్తీ పడుతున్నారని అన్నాడు ఇంజమామ్. ఒకటో రెండో ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేస్ దక్కించుకోవాలని చూస్తున్నట్లు చెప్పాడు. అలా కాకుండా పూర్తిస్థాయి ప్రదర్శనపై దృష్టిపెట్టాలని కోరాడు.