అహ్మదాబాద్ పింక్ టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై జయభేరి మోగించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది కోహ్లీ సేన. స్పిన్‌కు సహకరించిన పిచ్‌పై పర్యటక జట్టుతో భారత స్పిన్నర్లు ఓ ఆటాడుకున్నారు.
49 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. వికెట్లేమీ కోల్పోకుండా విజయం సాధించింది. రోహిత్ శర్మ 25, గిల్ 15 పరుగులు సాధించారు.
ఓవర్‌నైట్ స్కోర్ 99/3తో తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్.. మరో 46 పరుగులకే మిగతా 7 వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్ 5 వికెట్లతో మెరవగా.. లీచ్ 4 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ కంటే 33 పరుగులు ఎక్కువ చేసింది కోహ్లీ సేన.
కుప్పకూలిన రూట్ సేన..
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రూట్ సేన.. పూర్తిగా తడబాటుకు గురైంది. కేవలం 30.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అక్షర్ 5, అశ్విన్ 4 వికెట్లు తీశారు.
గులాబీ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ బ్యాటింగ్ ఆరంభించి 3 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు టీమ్ఇండియా మిగతా 7 వికెట్లు కోల్పోవడమే కాకుండా.. ఇరు జట్లవి రెండు ఇన్నింగ్స్‌లు సాగడం గమనార్హం.
ఆరంభంలోనే అదిరే రికార్డులు..
పునర్నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో పింక్ టెస్టు సందర్భంగా పలు రికార్డులు నమోదయ్యాయి.
నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడు 'ఐదు'లు..
రవీంద్ర జడేజాకు గాయం వల్ల తుది జట్టులోకి వచ్చిన అక్షర్.. అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఆడుతున్నది రెండో టెస్టే అయినా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం మూడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు మొత్తంగా 18 వికెట్లు తీశాడు అక్షర్. చెన్నై టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు తీసిన అక్షర్.. తాజా టెస్టులో 11 వికెట్లతో మెరిశాడు.
పింక్ టెస్టులో అక్షర్ 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన ఈ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తా చాటాడు.
400 క్లబ్లో అశ్విన్..
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇందుకు అశ్విన్ 77 టెస్టులు తీసుకోగా.. శ్రీలంగ దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్ 72 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
ధోనీని దాటిన విరాట్..
స్వదేశంలో ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ(22) రికార్డు సృష్టించాడు. ధోనీ (21) అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ఇదీ చదవండి: ఐసీసీ కొవిడ్ రూల్స్‌పై ఆఫ్రిదీ అసంతృప్తి