నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో గెలిచి, 2-1 తేడాతో సిరీస్ దక్కించుకుంది కోహ్లీసేన. ఆసీస్ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలుండగానే ఛేదించింది. రోహిత్ శర్మ, స్మిత్.. ఈ మ్యాచ్‌లో శతకాలతో చెలరేగారు.
287 పరుగల ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు రాహుల్-రోహిత్ శర్మ జోడీ.. 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 19 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ ఔటయ్యాడు.
ఆ తర్వాత కోహ్లీతో కలిసిన రోహిత్.. నెమ్మదిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డేల్లో 9000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు హిట్‌మ్యాన్. తక్కువ మ్యాచ్‌ల్లో ఈ రికార్డు అందుకున్న వారిలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే తన వన్డే కెరీర్లో29వ సెంచరీ నమోదు చేశాడు. లంక బ్యాట్స్‌మెన్ సనత్ జయసూర్యను అధిగమించాడు. 119 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.
మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ.. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ, వేగంగా ఆడాడు. 89 పరుగులు చేసి ఔటై, కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు. కానీ కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 5000 పరుగుల మార్క్‌ను అందుకున్న వాడిగా నిలిచాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్(44), మనీశ్ పాండే(4) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా, హేజిల్ వుడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్-ఫించ్ త్వరగా ఔటయ్యారు. ఆ తర్వాత స్మిత్-లబుషేన్ చక్కగా ఆడారు. మూడో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత అర్ధ సెంచరీ చేసిన లబుషేన్ ఔటయ్యాడు. స్మిత్ 131 పరుగులు చేసిన పెవిలియన్ బాట పట్టాడు.
మిగతా బ్యాట్స్‌మెన్ అంతగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో షమి 4, జడేజా 2, కుల్దీప్, సైనీ తలో వికెట్ పడగొట్టారు.