వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్. వెస్టిండీస్ నేడు జరిగే తొలి టీ20 కోసం పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు. హైదరాబాద్ వేదికగా జరగనుందీ మ్యాచ్.
ఓపెనర్ శిఖర్ ధావన్.. మోకాలి గాయం కారణంగా విండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టులో స్థానం కోల్పోయాడు. అతడి బదులుగా రాహుల్ ఓపెనింగ్‌కు రావొచ్చు. ఈ స్థానంలో రాహుల్ రికార్డు మెర్గుగా ఉండటం అతడికి కలిసొచ్చే అంశం.
రాహుల్‌కు మరో 26 పరుగులు కావాలి
మరో 26 పరుగులు చేస్తే టీ20ల్లో 1000 పరుగులు చేసిన ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ ఘనత సాధిస్తాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1తో టీమిండియా సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
పంత్‌పైనే అందరి దృష్టి
ఎన్ని అవకాశాలు ఇస్తున్నా బ్యాటింగ్‌లో, వికెట్ కీపింగ్‌లో పంత్ సత్తా చాటలేకపోతున్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చినా.. ఇతడిలో నిలకడ లోపించింది. ఇప్పటికే టెస్టుల్లో వృద్ధిమాన్ సాహా వల్ల తన స్థానాన్ని కోల్పోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేరళ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పంత్ ఎలా ఆడాతాడో చూడాలి.
కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ... విండీస్‌తో సిరీస్‌లో జట్టుకు కెప్టెన్సీ వహించనున్నాడు. పేసర్లు భువనేశ్వర్, షమి.. స్పిన్నర్లు కులదీప్ తిరిగి టీ20 జట్టులో పునరాగమనం చేశారు. భువీ, షమి, దీపక్ చాహర్‌లతో భారత్ పేస్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. స్పిన్నర్లు జడేజా, కులదీప్, చాహల్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
కరీబియన్లు పుంజుకుంటారా?
ఈ ఏడాది ఆగస్టులో సొంతగడ్డపై భారత్ చేతిలో 0-3 తేడాతో టీ20 సిరీస్ కోల్పోయి ఘోర పరాభవం చవిచూసింది వెస్టిండీస్. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. కీరన్ పొలార్డ్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. ట్యాంపరింగ్ ఉదంతంతో నాలుగు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొంటున్న నికోలస్ పూరన్ జట్టుకు దూరమయ్యాడు. బ్యాటింగ్‌లో షాయ్ హోప్, హెట్మయిర్పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.
వచ్చే ఏడాది ట్వంటీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ కాంబినేషన్లను ప్రయత్నించాలని విండీస్ భావిస్తోంది. జట్టులోని కొత్త వారిని పరీక్షించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది.