భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టీ-20 అహ్మదాబాద్ వేదికగా గురువారం జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకంజలో ఉన్న టీమ్ఇండియాకు ఈ టీ-20 కీలకం. గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేసిన జట్టే విజయం సాధిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ టాక్ ముఖ్య పాత్ర పోషించనుంది. అయితే రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఒకటి నెగ్గిన కోహ్లీ సేన.. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే ఇందులో విజయం సాధించడం తప్పనిసరి. టాస్‌తో సంబంధం లేకుండా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను ఓడించాల్సి ఉంది.
రాహుల్‌కు మరో ఛాన్స్ ఇస్తారా?
ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవమైన ఫామ్ టీమ్ఇండియాను కలవరపరుస్తోంది. తొలిమ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు చేసిన రాహుల్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ కోహ్లీ, టీమ్ మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్‌కు అండగా నిలుస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌నకు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీనే తమ తొలి ప్రాధాన్యం అని కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో నాలుగో టీ20లో కేఎల్ రాహుల్‌ను కొనసాగిస్తారా లేదా అనే దానిపై సందేహం నెలకొంది. ఒకవేళ రాహుల్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తే.. రెండో టీ20లో అర్ధశతకంతో సత్తాచాటిన ఇషాన్ కిషన్.. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
అప్పుడు సూర్య కుమార్ యాదవ్‌కు మిడిలార్డర్లో మరోసారి చోటు దక్కనుంది. ముఖ్యంగా తొలుత బ్యాటింగ్ చేసిన రెండుసార్లు పవర్ ప్లే ఓవర్లలో భారత్ ఇబ్బందులకు గురైంది. త్వరగా వికెట్లు కోల్పోయి వేగంగా పరుగులు సాధించలేకపోయింది. తొలిమ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, మూడో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అర్ధశతకాలతో కదంతొక్కినా.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాలను భారత్ ఉంచలేకపోయింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పేసర్లు మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లే ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు.
మూడో ఆల్‌రౌండర్‌ను తీసుకుంటారా?
హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్‌తో పాటు మూడో ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేయని రాహుల్ తెవాతియా లేదా అక్షర్ పటేల్‌లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టును కలవరపరుస్తోంది. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నా నిలకడగా వికెట్లు తీయాలని భారత్ కోరుకుంటోంది.
ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 6.95 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేస్తూ నాలుగు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. సిరీస్‌లో 1-2తో వెనుకబడినప్పటికీ నాలుగో మ్యాచ్ కోసం భారత జట్టులో భారీ మార్పులేమీ ఉండకపోవచ్చు.
మరోవైపు నాలుగో టీ20లో నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ జట్టు కృతనిశ్చయంతో ఉంది. బట్లర్, బెయిర్‌స్టో, రాయ్ అద్భుత ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ పూర్తి స్థాయిలో రాణించాలని ఆ జట్టు కోరుకుంటోంది. బౌలింగ్ విభాగంలో మార్క్‌వుడ్, ఆర్చర్, సామ్ కరన్.. రాణిస్తుండటం ఇంగ్లిష్ జట్టుకు సానుకూలాంశం. గురువారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్: 3 ఫార్మాట్లలోనూ టాప్-5లో కోహ్లీ