చెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా అద్వితీయ విజయం సాధించింది. అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారీ ఓటమి చవిచూసింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో విజృంభించిన.. అక్షర్ 5/60, అశ్విన్ 3/53 మరోసారి చెలరేగారు. దీంతో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 53/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు మంగళవారం ఆట మొదలెట్టిన ఇంగ్లాండ్ మరో 111 పరుగులు చేసి చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.
కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ నాలుగోరోజు కనీస పోరాటం చేయలేదు. ఆదిలోనే అశ్విన్.. లారెన్స్(26)ను బోల్తాకొట్టించడం వల్ల ఇంగ్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. కెప్టెన్ జోరూట్(33) వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసినా ధాటిగా పరుగులు చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే బెన్‌స్టోక్స్(8), ఓలీపోప్(12), బెన్ ఫోక్స్(2) వరుసగా విఫలమయ్యారు. దాంతో ఇంగ్లాండ్ భోజన విరామ సమయానికే 116/7తో ఓటమికి చేరువైంది. ఇక రెండో సెషన్‌లో ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయడానికి భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అక్షర్ వరుస ఓవర్లలో రూట్, స్టోన్‌ను(0) ఔట్ చేయడం వల్ల ఇంగ్లాండ్ ఓటమి లాంఛనమే అయింది.
అయితే, చివర్లో మొయిన్ అలీ(43) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బ్రాడ్‌తో కలిసి పదో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే అర్ధశతకానికి చేరువైన అతడు కుల్‌దీప్ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ వచ్చి షాట్ ఆడేందుకు యత్నించగా స్టంపౌటయ్యాడు. అలా ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌటైంది.
స్కోర్ బోర్డు వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 329 ఆలౌట్; రోహిత్(161).. ఓలీస్టోన్ 3/47, మొయిన్ అలీ (4/128)
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 134 ఆలౌట్; బెన్ ఫోక్స్(42).. అశ్విన్ 5/43
భారత్ రెండో ఇన్నింగ్స్: 286 ఆలౌట్; అశ్విన్(106).. మొయిన్ అలీ 4/98
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 164 ఆలౌట్; మొయిన్ అలీ(43).. అక్షర్ 5/60.