టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గుతున్న సమయంలో... గులాబి బంతితో ఆట అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. నెలరోజుల క్రితం వరకు డే/నైట్ మ్యాచ్ గురించి అలికిడే లేదు. అలాంటిది బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన దాదా.. సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో సుదీర్ఘ మ్యాచ్ నిర్వహించేందుకు నడుం బిగించాడు. ఈ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ కోహ్లీ, బంగ్లా బోర్డు కూడా వెంటనే అంగీకరించాయి.
ఇలాంటి సమయంలో గులాబి బంతి ఎక్కువ స్వింగ్ అవుతుందని ఒకరు. సంధ్య వెలుగులో కనిపించడం కష్టమని మరొకరు. అలవాటు పడితే కష్టమేం కాదంటూ ఇంకొకరు. ఇవన్నీ అభిమానుల్లో ఆత్రుత, ఆసక్తిని అంతకంతకూ పెంచేశాయి. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలన్న ఆరాటం కలిగిస్తున్నాయి. చారిత్రక డే/నైట్ టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఈడెన్‌గార్డెన్స్‌లో.. నేడు భారత్-బంగ్లా జట్లు మధ్య టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.
నయా ట్రెండ్...
అంతర్జాతీయ క్రికెట్లో కొత్తగా ఏం ప్రవేశపెట్టినా విస్తృత ప్రచారం జరిగేది మాత్రం భారత్‌లోనే. సుదీర్ఘ ఫార్మాట్‌కు పునరుజ్జీవం కలిగించాలని ఐసీసీ 2015లోనే డే/నైట్ టెస్టులకు అనుమతిచ్చింది. బీసీసీఐ వ్యతిరేకించడం వల్ల ఇప్పటి వరకు ఉపఖండంలో గులాబి కల నెరవేరలేదు. మార్పులు, సంస్కరణలు ఇష్టపడే సౌరవ్ గంగూలీ... బీసీసీఐ అధ్యక్షుడు అయిన తర్వాత పరిస్థితి మారింది. అతడు ప్రతిపాదించిన మూడే మూడు సెకన్లలో విరాట్ గులాబి టెస్టుకు ఓకే చెప్పేశాడు. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేందుకు కనీసం రెండు, మూడు నెలలైనా పడుతుందని భావించారు. అనూహ్యంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో రెండే టెస్టుకే ఒప్పించడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ్ బంగా సీఎం మమతా బెనర్జీ ఈ మ్యాచ్‌ను గంట కొట్టి ఆరంభించనున్నారు.
ఆసీస్‌దే ఆధిపత్యం...
ఇప్పటి వరకు మొత్తం 11 డే/నైట్ టెస్టులు జరిగాయి. చారిత్రక తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. అడిలైడ్ ఓవల్ వేదికగా 2015 నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు జరిగిన ఈ పోరులో ఆతిథ్య ఆసీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విధంగా తొలిసారి క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది.
గులాబి టెస్టుల్లో అత్యంత విజయవంతమైన జట్టు కంగారూలదే. ఐదు టెస్టులాడి అన్నింటా గెలిచింది. అడిలైడ్‌లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్లు, ఇంగ్లాండ్‌పై 120 పరుగులు, గబ్బాలో పాక్‌పై 39 పరుగులు, శ్రీలంకపై ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఆసీస్ తర్వాత డే/నైట్ టెస్టుల్లో విజయవంతమైంది శ్రీలంక. మూడింటిలో రెండు గెలిచింది. దుబాయ్‌లో పాక్‌పై 68 పరుగులు, బ్రిడ్జిటౌన్‌లో విండీస్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్, విండీస్‌పై పాక్, ఇంగ్లాండ్ జట్లు తలో విజయం అందుకున్నాయి.
రికార్డు పరుగులు...
డే/నైట్ టెస్టు బ్యాటింగ్ రికార్డుల్లో పాక్‌దే ఆధిపత్యం. ఆ జట్టు ఆటగాడు అజహర్ అలీ 6 ఇన్నింగ్సుల్లో 91 సగటుతో 456 పరుగులు చేశాడు. పింక్ బంతితో త్రిశతకం బాదిన ఘనతా అతడికే సొంతం. విండీస్‌పై 302తో నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాకుండా గులాబి టెస్టుల్లో రెండు శతకాలు చేసిన ఒకే ఒక్క ఆటగాడు పాక్‌కు చెందిన అసద్ షఫిక్.
ఆసీస్ మాజీ సారథి స్టీవ్‌స్మిత్ 50.62 సగటుతో 4 టెస్టుల్లో 405 పరుగులు సాధించాడు. ఒక శతకం, మూడు అర్ధశతకాలు సాధించాడు.
వికెట్ల రారాజు...
గులాబి బంతితో అత్యంత విజయవంతమైన బౌలర్ మిచెల్ స్టార్క్. ఐదు టెస్టుల్లో ఈ ఆసీస్ పేసర్ 23 సగటుతో 26 వికెట్లు పడగొట్టాడు. అందులో ఐదు వికెట్ల ఘనత ఉండటం విశేషం. మరో పేసర్ జోష్ హేజిల్‌వుడ్ 22.42 సగటుతో 21 వికెట్లు తీశాడు. ఎక్కువ డే/నైట్ టెస్టులు ఆడింది కంగారూలే కాబట్టి వారే ఈ రికార్డుల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ అత్యుత్తమ వ్యక్తిగత రికార్డు సృష్టించాడు. పాక్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లు వేసి 49 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. ఈ ఏడాది జనవరిలో శ్రీలంకపై ప్యాట్ కమిన్స్ 6/23 గణాంకాలు నమోదు చేశాడు.
షమి సొంతమైదానం...
భారత్, బంగ్లా తొలి డే/నైట్ టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఈడెన్‌గార్డెన్స్... టీమిండియాకు అచ్చొచ్చిన వేదికల్లో ఒకటి. కోహ్లీసేన ఇక్కడ కొన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. వన్డేల్లో ఇక్కడే ఒక డబుల్ సెంచరీ బాదిన రోహిత్‌శర్మ... నేటి మ్యాచ్‌లో చెలరేగితే బంగ్లా పని అయిపోయినట్లే.
ప్రస్తుత స్టార్ బౌలర్ మహ్మద్ షమి సొంత మైదానమిది. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు బౌలింగ్ గణాంకాల్లో అరుదైన ఘనతలు అందుకోవచ్చు. క్యాబ్ గతంలో ఇక్కడ నిర్వహించిన స్థానిక టోర్నీలో బాగా రాణించాడు. అతడి బంతులు ఆడేందుకు ప్రత్యర్థి జట్టు ఇబ్బంది పడింది. కీపర్ వృద్ధిమాన్ సాహా బంగాల్ క్రికెటరే. అతడికీ ఈ పిచ్‌పై బాగా పట్టుంది. బ్యాటింగ్, కీపింగ్‌తో అతడు అత్యంత కీలకం కానున్నాడు. జోరుమీదున్న మయాంక్ అగర్వాల్ నుంచి అభిమానులు ఈ సారి త్రిశతకం ఆశిస్తున్నారు. ఇండోర్‌లో డకౌటైన కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు.