కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు(నవంబర్ 22న) రెండో టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి భారత్-బంగ్లాదేశ్ జట్లు. ఇది డే/నైట్ టెస్టు కావడం విశేషం. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఈ తరహాలో టెస్టు ఆడలేదు.
ఇక్కడ మ్యాచ్‌ను ప్రారంభించే ముందు గంట మోగించే సంప్రదాయం ఉంది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు.
![Bengal CM Mamata Banerjee, Bangladesh PM Sheikh Hasina to ring Eden Gardens bell jointly to start D/N Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5138827_pink2.jpg)
దిగ్గజాల రాక..
ఈ మ్యాచ్‌కు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, ఒలింపిక్స్ ఛాంపియన్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ సహా పలువురు భారత జట్టు టెస్టు సారథులు హాజరుకానున్నారు.
బంతులు రావట్లే...
టాస్ వేసే ముందు పారాట్రూపర్స్ గాల్లో ఎగిరి రెండు జట్ల సారథులు కోహ్లీ, మొమినల్‌కు గులాబి బంతులు అందజేస్తారని ముందుగా ప్రణాళిక రచించింది క్యాబ్(బెంగాల్ క్రికెట్ అసోసియేషన్). అయితే కొన్ని భద్రత కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది.
![Bengal CM Mamata Banerjee, Bangladesh PM Sheikh Hasina to ring Eden Gardens bell jointly to start D/N Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5138827_mamata3.jpg)
దాదానే ఆధ్యుడు..
దాదా బంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన తర్వాత 2016లో ఈడెన్‌లో గంట ఏర్పాటు చేశాడు. అప్పట్నుంచి గంట మోగించిన తర్వాతే ఆట మొదలు పెడుతున్నారు. తొలిసారి ఆ గంటను మోగించిన వ్యక్తిగా కపిల్‌దేవ్ రికార్డులకెక్కాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య 2016లో ఈ టెస్టు జరిగింది.
![india vs bangladesh 2019: Bengal CM Mamata, Bangladesh PM Sheikh Hasina to ring Eden Gardens bell jointly to start pink Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5010009_ganguly2323.jpg)
క్రికెట్ మ్యాచ్‌లకు ప్రధాని హాజరుకావడం కొత్తేమి కాదు. 2011 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌కు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించారు. ఆయన ఆ మ్యాచ్‌ను తిలకించారు. భారత్-పాక్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు నాటి పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ కూడా హాజరయ్యారు. ఇక భారత్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, రెండు టెస్టుల సిరీస్ కోసం నవంబర్ 3న అడుగుపెట్టింది బంగ్లా జట్టు. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది టీమిండియా.
ఓ వేడుకలా...
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి గులాబి బంతి టెస్టు... ఆట, పాటల నడుమ జరగనుంది. మ్యాచ్ విరామంలో గాయనీ గాయకుల ఆటాపాటా, టీమిండియా దిగ్గజాలకు సత్కారాలు ఉంటాయి. రాజకీయ నాయకులు హాజరవుతారు. చారిత్రక డే/నైట్ టెస్టు ప్రణాళికంతా ఆసక్తికరంగా ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు.
![india-vs-bangladesh-2019-bengal-cm-mamata-bangladesh-pm-sheikh-hasina-to-ring-eden-gardens-bell-jointly-to-start-pink-test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5138827_fab.jpg)
"సచిన్ తెందూల్కర్, సునిల్ గావస్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే ప్రతి ఒక్కరూ అక్కడికి వస్తారు. తేనీటి విరామంలో మైదానంలో మాజీ సారథుల ఊరేగింపు జరుగుతుంది. మరో విరామంలో, ఆట ముగిసిన తర్వాత సంగీత విభావరి ఏర్పాటు చేశాం. రెండు జట్లు, మాజీ సారథులు, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడికి వస్తారు. రునా లైలా, జీత్ గంగూలీ సంగీత ప్రదర్శనలు ఉంటాయి. నేనెంతో ఆసక్తిగా ఉన్నా. నా ఉత్తేజాన్ని గమనించండి. నాలుగు రోజుల టికెట్లు అప్పుడే అమ్ముడయ్యాయి".
-- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఈ మ్యాచ్‌కు స్టార్ షట్లర్ పీవీ సింధు, చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, ఒలింపిక్స్ ఛాంపియన్ అభినవ్ బింద్రా తదితరులు మ్యాచ్‌కు హాజరు కానున్నారు. వీరిని బంగాల్ క్రికెట్ సంఘం సన్మానించనుంది. అంతేకాకుండా గంగూలీ, సచిన్, ద్రవిడ్, కుంబ్లే, లక్ష్మణ్‌తో కలిసి 40 నిమిషాల చర్చా కార్యక్రమాన్ని క్యాబ్ ఏర్పాటు చేసింది. ఈడెన్‌లో 2001లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గురించి వారు మాట్లాడతారు.