ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్ ముగిసింది. ఇక అందరి దృష్టి నాలుగు టెస్టుల సిరీస్‌పైనే. డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది. అయితే పితృత్వ సెలవులపై విరాట్ కోహ్లీ ఆఖరి మూడు టెస్టులకు దూరమవ్వడం టీమ్ఇండియా అభిమానులను కలవరపెడుతోంది. కాగా, 2018-19 పర్యటనలో మాదిరిగా భారత్ టెస్టు సిరీస్ విజయాన్ని పునరావృతం చేయాలంటే గతంలో పుజారాలా ఆ పాత్రను మరోసారి ఎవరైనా పోషించాలని ఎన్‌సీఏ డైరెక్టర్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. గత ఆసీస్ పర్యటనలో పుజారా 521 పరుగులు సాధించి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచాడు.
"గత పర్యటనలో పుజారా నిర్వహించిన బాధ్యతను ఈ సారి ఎవరు పోషిస్తారు? గతంలో పుజారా 500కు పైగా పరుగులు సాధించినట్లుగా టీమ్ఇండియాలో ఎవరో ఒకరు సాధించాలి. అది పుజారా అయినా కావొచ్చు. అయితే కోహ్లీకి ఆ అవకాశం ఉండదు. పర్యటన ఆఖరి వరకు అతడు ఉండడు. ఆసీస్‌ను ఎదుర్కోవాలంటే నాలుగు టెస్టుల్లో కనీసం ఒకరైనా 500 పరుగులు చేయాలి. మరోవైపు ఆస్ట్రేలియాలో పరిస్థితులు అత్యంత సవాలుగా ఉంటాయి. నాణ్యమైన పేసర్లు ఆ జట్టులో ఉండటం వల్ల పేస్‌కు అనుకూలించే పిచ్‌లు సిద్ధం చేస్తారు. అయిదు రోజుల్లో 20 వికెట్లు తీయగలం. కానీ పరుగులు చేసే బ్యాట్స్‌మన్ మనకు అవసరం. అలా చేస్తే ఆసీస్‌కు దీటైన పోటీ ఇవ్వొచ్చు. స్మిత్, వార్నర్ చేరికతో ఆస్ట్రేలియా పటిష్ఠంగా ఉంది" అని ద్రవిడ్ తెలిపాడు.
భారత్-ఆసీస్ టెస్టు గురించి దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. తొలి టెస్టులో విజయం సాధిస్తేనే చరిత్రను పునరావృతం చేయవచ్చని అన్నాడు. "తొలి టెస్టులో విజయం సాధిస్తే గత పర్యటనలో మాదిరిగానే ఆసీస్‌పై చేయి సాధించగలం. స్మిత్, వార్నర్ ఆసీస్ జట్టులోకి చేరడం, కోహ్లీ చివరి మూడు మ్యాచ్‌లకు దూరమవ్వడం భారత్‌కు ప్రతికూలాంశం. అయితే బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత జట్టు పటిష్ఠంగానే ఉంది. గులాబీ బంతితో జరిగే టెస్టులో ఆసీస్‌కు మంచి అనుభవం ఉంది. అడిలైడ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ పోటీలో నిలవగలదు. ఓటిమి పాలైతే కోహ్లీ లేని టీమ్ఇండియాకు చివరి మూడు టెస్టులు ఎంతో కఠినంగా ఉంటాయి" అని కుంబ్లే పేర్కొన్నాడు. 2018-19 ఆసీస్ పర్యటనలో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి : వర్ణవివక్షతో పుజారాను అలా పిలిచేవారు!