టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. సగటు ప్రేక్షకులే కాకుండా క్రికెటర్లూ అతడి ఆటను అనుకరిస్తుంటారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారే చేరాడు. మహీ తరహాలో తాను కూడా అత్యుత్తమ ఫినిషర్ అవ్వాలనుకుంటున్నానని అన్నాడు.
"నా ఆటలో ఉన్న కొన్ని బలహీనతలను అధిగమించాల్సి ఉంది. మిడిలార్డర్ లేదా లోయరార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి జట్టును విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ఈ విషయంలో ప్రపంచంలోనే ధోనీ అత్యుత్తమం. అతడి నుంచి వీలైనంత నేర్చుకోవాలి. టీమిండియా కోసం అతడు ఆఖరి వరకు పోరాడి జట్టును గెలిపించిన తరహాలోనే.. నేను నా దేశం కోసం పోరాడాలని భావిస్తున్నా. భారత్‌లో టీమిండియాను ఎదుర్కోవడం ఎంతో కష్టం. స్పిన్‌తో పాటు ప్రపంచ స్థాయి పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీని ఎదుర్కోవడం సవాలే."
-అలెక్స్ కారే, వికెట్ కీపర్
లోయరార్డర్‌లో రాణించడమే తన బాధ్యతని అంటున్నాడు అలెక్స్.
"మరికొన్ని రోజుల్లో భారత్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వికెట్ కీపింగ్, మిడిల్ లేదా లోయరార్డర్‌లో రాణించడమే నా బాధ్యత. జట్టు అవసరాలను బట్టి 5,6,7 స్థానాల్లో బ్యాటింగ్‌కు రావాలి. మా జట్టులో ఫించ్, వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. భారత్‌కు మేం గట్టి పోటీనిస్తాం."
-అలెక్స్ కారే, ఆసీస్ వికెట్ కీపర్
టీమిండియాతో ఆస్ట్రేలియా మూడు వన్డేలు ఆడనుంది. ముంబయి వేదికగా మంగళవారం తొలి మ్యాచ్, జనవరి 17న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, జనవరి 19న బెంగళూరులో ఆఖరి మ్యాచ్ జరగనుంది.
ఇదీ చదవండి: వార్న్, పాంటింగ్ కెప్టెన్లుగా కార్చిచ్చు బాధితుల ఛారిటీ మ్యాచ్