ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న గులాబీ బంతి సన్నాహక మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమైనా, బౌలర్లు చెలరేగారు. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ కంటే ఆసీస్ 86 పరుగుల వెనుకంజలో ఉంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 194 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (43), పృథ్వీ షా (40) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ తేలిపోయిన వేళ బుమ్రా (55*) బ్యాటుతో ఆకట్టుకున్నాడు. అజేయ అర్ధశతకంతో సత్తాచాటాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అతడికి ఇదే తొలి అర్ధశతకం. అయితే బుమ్రా సిక్సర్‌తో ఈ ఘనత సాధించడం విశేషం. 123 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సిరాజ్ (22)తో కలిసి బుమ్రా ఆదుకున్నాడు. ఆఖరి వికెట్‌కు 71 పరుగులు జోడించాడు.
అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఏ.. 108 పరుగులకే కుప్పకూలింది. షమి (3/29), సైనీ (3/19), బుమ్రా (2/33) మెరిశారు. సిరాజ్ ఓ వికెట్ తీశాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ కేరీ (32), హ్యారిస్ (26) ఎక్కువ పరుగులు చేశారు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, పుజారా, కేఎల్ రాహుల్ ఆడలేదు. పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకోగా సాహా ఫీల్డింగ్ చేశాడు.
కామెరూన్ గ్రీన్‌కు కంకషన్
బౌలింగ్ చేస్తూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కంకషన్‌కు గురయ్యాడు. బుమ్రా ఆడిన షాట్ గ్రీన్ తలకు నేరుగా తగిలింది. వెంటనే నాన్‌స్ట్రైకర్ సిరాజ్.. గ్రీన్ వద్దకు వెళ్లి పరిశీలించాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించిన అనంతరం అతడు మైదానాన్ని వీడాడు. అయితే అతడికి కంకషన్ స్వల్ప లక్షణాలు కనిపించాయని జట్టు వైద్యులు తెలిపారు. అతడి స్థానంలో పాట్రిక్ మైదానంలోకి వచ్చాడు. తొలి వార్మప్ మ్యాచ్‌లో పకోస్కీ కూడా కంకషన్‌కు గురయ్యాడు. కార్తిక్ త్యాగి విసిరిన బౌన్సర్ అతడి తలకు తగిలింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">