ఇంగ్లాండ్ కంట్రీ గ్రౌండ్ వేదికగా అండర్-19 త్రైపాక్షిక సిరీస్ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తుదిపోరులో భారత అండర్-19 జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ ప్రియమ్ గర్గ్(73), ధ్రువ్ జురెల్(59), దివ్యాంశ్ సక్సేనా(55), యశస్వీ జైస్వాల్(50) అర్ధశతకాలతో మెరిశారు. 48.4 ఓవర్లలో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాట్స్‌మన్ హసన్ జాయ్(109) సెంచరీతో ఆకట్టుకోగా.. ఫర్వేజ్ హొస్సేన్(60) అర్ధశతకంతో మెరిశాడు. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది బంగ్లాదేశ్. కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా చెరో రెండు వికెట్లతో రాణించగా.. రవి, శుభాంగ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
లక్ష్య ఛేదనలో భారత్ కుర్రాళ్లు ఆకట్టుకున్నారు. ఓపెనర్లు యశస్వి, దివ్యాంశ్ శుభారంభం అందించగా... అనంతరం కెప్టెన్ ప్రియమ్ అదరగొట్టాడు. 66 బంతుల్లో 73 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివర్లో ధ్రువ్ ఆచితూచి ఆడి భారత్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. బంగ్లా బౌలర్లలో రకిబుల్ హసన్ రెండు వికెట్ల తీయగా.. షోరిఫుల్ ఇస్లాం, మృత్యుంజయ్ చౌదరి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, భారత్ మధ్య జరిగిన ఈ త్రైపాక్షిక సిరీస్ జులై 21న ప్రారంభమైంది. ఒక్కో జట్టు 8 మ్యాచ్‌లాడగా.. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న బంగ్లా, భారత్ ఫైనల్‌కు చేరాయి.
ఇదీ చదవండి: రోజర్స్ కప్ బియాంకాదే.. ఫైనల్లో సెరెనాపై విజయం