భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్ ప్రపంచ క్రికెట్లో ఉత్తేజకరమైన ఆటల్లో ఒకటిగా పేర్కొన్నాడు ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లైయన్. యాషెస్(ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్) సిరీస్‌లాగే టీమ్ఇండియాతో సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండనుందని అన్నాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైయన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

ఆస్ట్రేలియాలో చివరిసారిగా భారత్ 2-1 తేడాతో తొలి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో ఇరు దేశాలు మరోమారు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా రాక కోసం ఆతిథ్య జట్టు ఆసక్తిగా ఉన్నట్లు నాథన్ పేర్కొన్నాడు.

''ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నప్పుడు ఓడిపోవడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం భారత జట్టు ఆటతీరులో మా కంటే మించిపోయారు. అందుకే వారితో జరిగే సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. యాషెస్ లాంటి సిరీస్ సరసన ఈ టోర్నీ చేరనుంది. భారత్ టీమ్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు.. ఈ వేసవిలో మాకు అద్భుతమైన సవాలుగా మారనుంది.''
-నాథన్ లైయన్, ఆస్ట్రేలియా క్రికెటర్
మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. టోర్నీ నిర్వహణకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సిరీస్‌ను నిశితంగా పరిశీలించనున్నట్లు లైయన్ తెలిపాడు.

ఇదీ చూడండి:ఆసియాకప్ జరుగుతుంది.. కానీ పాక్‌లో కాదు!