ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావాల్సిన ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా ఖాళీ స్టేడియాల్లో ఆడాల్సిన అవసరం లేదని ఆ దేశ ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ అన్నారు. వచ్చే నెల నుంచి ఇచ్చే సడలింపుల్లో భాగంగా మైదానాల్లో ప్రేక్షకులను అనుమతించే విధంగా నిర్ణయం తీసుకొనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. స్టేడియాల్లోకి 25 శాతం మంది వీక్షకులకు అనుమతి కల్పించి మ్యాచ్‌లను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.
"వచ్చే నెల నుంచి ఇవ్వబోతున్న సడలింపుల్లో భాగంగా క్రీడా టోర్నీలకు వీక్షకులను అనుమతించనున్నాం. 40 వేల మంది సామర్థ్యం గల మైదానాల్లో 25 శాతం మందిని.. అంటే 10 వేల మంది కోసం టికెట్లు జారీ చేస్తాం. దీని కోసం కొంతమంది నిపుణుల సలహాలు తీసుకుని ఏర్పాట్లు చేస్తాం".
-స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి
శుక్రవారం వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో పాటు అధికారులతో నిర్వహించిన సమావేశం తర్వాత ఈ ప్రకటన చేశారు మోరిసన్.
భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ను నిర్వహించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇటీవలే తెలిపింది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌తో సహా ఆతిథ్య స్టేడియాలను ఇటీవలే ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ నిర్వహణపై మరికొంత సమయం ఎదురుచూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిదని ఆసీస్ పేసర్ కేన్ రిచర్డ్సన్ తెలిపాడు. భవిష్యత్‌లో ఏమి జరగబోతుందో తెలియనపుడు కొంత సమయాన్ని వెచ్చించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి... 'టీ20ల్లో డబుల్ సెంచరీ చేసే సత్తా రోహిత్‌కు ఉంది'