టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అజింక్య రహానె, యువ ఓపెనర్ పృథ్వీషా దేశవాళీ బాటపట్టారు. మిలింద్ రెగె సారథ్యంలోని తాత్కాలిక సెలక్షన్ కమిటీ వీరిని ముంబయి జట్టుకు ఎంపిక చేసింది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీసులు ఆడనుంది. పరిమిత ఓవర్ల జట్టులో రహానె, పృథ్వీషా ఎంపికవలేదు. న్యూజిలాండ్ పర్యటనకు మరో రెండు నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ రంజీ జట్టుతో చేరనున్నారు.
ముంబయి ఇప్పటి వరకు 41 సార్లు రంజీ ట్రోఫీ గెలిచింది. 2019-20 సీజన్‌లో తొలి మ్యాచ్‌ను డిసెంబర్ 9న బరోడాతో ఆరంభించనుంది. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు సారథ్యం వహిస్తాడు. అనుభవజ్ఞుడైన ఆదిత్య తారె వైస్ కెప్టెన్. శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ శివమ్ దూబె వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపికవ్వడం వల్ల అందుబాటులో ఉండటం లేదు. ఎనిమిది నెలల నిషేధం తర్వాత తిరిగి క్రికెట్లోకి వచ్చిన పృథ్వీషా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సూపర్ లీగ్ దశలో ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు రంజీల్లోనూ అదరగొట్టాలని కసితో ఉన్నాడు. ముంబయిని ఆపదలో ఆదుకొనే సిద్దేశ్ లాడ్ శుక్రవారం పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు.
ఇదీ చదవండి: 1500 మీటర్ల పరుగులో భారత్‌కు 4 మెడల్స్