అరుణ్‌జైట్లీ మైదానం (కోట్లా)లో నవంబర్ 3న భారత్, బంగ్లాదేశ్ తొలి టీ20 ఆడనున్నాయి. అయితే దిల్లీలో సాధారణంగా వాయు కాలుష్యం ఎక్కువ. శీతకాలం సమీపించడం, దీపావళి పండుగ వచ్చినందున.. దిల్లీ వాతవరణం మరింత కాలుష్యంగా మారింది. ఫలితంగా అక్కడి వాతావరణంతో బంగ్లా ఆటగాళ్లు అస్వస్థతకు గురవుతారేమోనని డీడీసీఏ కలవరపడుతోంది. ముందస్తు చర్యగా వారితో మాస్కులు ధరించేలా చూడాలని భావిస్తోంది.
మ్యాచ్ సమయానికి తగ్గనున్న ఏక్యూఐ
దీపావళి పండగ కన్నా ముందే దిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 301-400 మధ్య ప్రమాదకరంగా ఉంది. ఇక గురువారం ఉదయం 357గా నమోదైంది. 400 దాటితే తీవ్ర శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీపావళి పండుగ నేపథ్యంలో టపాసులు పేలిస్తే.. గాలి నాణ్యత మరింత దిగజారుతుంది. అయితే పండగ జరిగిన వారం రోజుల తర్వాత మ్యాచ్ ఉన్నందున.. సమస్య తీవ్రత తగ్గుతుందని డీడీసీఏ, బీసీసీఐ ఆశిస్తోంది. మరోవైపు పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో గడ్డిని తగలబెట్టొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఉపశమనం కలిగించే అంశం.
రొటేషన్ ప్రకారం మ్యాచ్‌లు
శీతకాలంలో దిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించొద్దని ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ.. రొటేషన్ ప్రకారం మ్యాచ్‌లను కేటాయించక తప్పటం లేదు. ఈ రొటేషన్ పాలసీ ప్రకారమే తొలి టీ20ని దిల్లీకి కేటాయించాల్సి వచ్చింది. పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు నేరుగా దిల్లీకి చేరుకుంటుంది. రెండు, మూడు టీ20లను నాగపూర్, రాజ్‌కోట్‌లలో ఆడుతుంది. అనంతరం ఇండోర్, కోల్‌కతాలో టెస్టులు ఆడి స్వదేశానికి పయనమవుతుంది.
గతంలోనే మాస్కులు
దిల్లీలో గతంలోనూ విదేశీ ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఆడిన సందర్భాలు ఉన్నాయి. 2017, డిసెంబర్‌లో శ్రీలంక ఆటగాళ్లు అస్వస్థకు గురై, ముఖానికి మాస్క్‌లు ధరించి ఆడారు. అయినా రెండు మూడు సార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.
ఇదీ చూడండి : భారత్-బంగ్లాదేశ్: ఈడెన్ టెస్టులో 'గులాబి బంతి'..!