సారథి విరాట్ కోహ్లీ అద్భుత శతకం(120) , బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్(4/31) సత్తాచాటిన వేళ వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి విండీస్ లక్ష్యాన్ని 270 పరుగులకు నిర్దేశించారు. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ పోరాటం 42 ఓవర్లలో 210 పరుగుల వద్దే ముగిసింది. ఓపెనర్ లూయిస్(65), పూరన్(42) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత బౌలరల్లో షమి, కుల్దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధశతకం(71)తో రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0తో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.