పుణె వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన.. ఇంగ్లిష్ జట్టు ముందు 337 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేఎల్ రాహుల్(108; 114 బంతుల్లో 7x4, 2x6) శతకానికి తోడు పంత్(77; 40 బంతుల్లో), కోహ్లీ(66; 79 బంతుల్లో) అర్ధశతకాలు సాధించారు. చివర్లో హార్దిక్ పాండ్యా(35; 16 బంతుల్లో) దంచికొట్టడం వల్ల భారత్ ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.
అనంతరం ఇంగ్లాండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(55; 52 బంతుల్లో), జానీ బెయిర్‌స్టో (124; 112 బంతుల్లో) తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించగా, తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్(99; 52 బంతుల్లో) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. తన బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ 43.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో 1-1తో సిరీస్‌ను సమం చేసింది.
ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు..
- వన్డే చరిత్రలో టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌కిదే అత్యుత్తమ భారీ ఛేదన
- వన్డేల్లో 300కు పైగా పరుగుల్ని ఛేదించడం ఇంగ్లాండ్‌కు ఇది 12వ సారి. 19 ఛేదనలతో భారత్ అగ్రస్థానంలో ఉంది.
- ఓ వన్డేలో అత్యధిక సిక్సులు బాదిన టీమ్ఇండియా వికెట్ కీపర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు పంత్. ఇతడు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 7 సిక్సులు సాధించాడు. ధోనీ 10 సిక్సులతో ముందున్నాడు. రాహుల్ 6 సిక్సులతో వీరి తర్వాత నిలిచాడు.
- ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టోకు ఇది 11వ శతకం. ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు. అతడికిది 78వ ఇన్నింగ్స్. హషీమ్ ఆమ్లా 64, క్వింటన్ డికాక్ 65, బాబర్ అజామ్ 71 ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 11వ సెంచరీ సాధించారు.
- అంతర్జాతీయ క్రికెట్‌లో అదిల్ రషీద్.. విరాట్ కోహ్లీని అత్యధికంగా తొమ్మిది సార్లు ఔట్ చేశాడు. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ అత్యధికంగా పది సార్లు కోహ్లీని పెవిలియన్ చేర్చి అగ్రస్థానంలో నిలిచాడు.
- మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పదివేల పరుగుల మైలురాయి చేరుకున్న తొలి టీమ్‌ఇండియా ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా రెండో ఆటగాడిగా ఉన్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ (12662) ఈ ఘనత సాధించాడు.