భారత పిచ్‌ల గురించి విమర్శలు చేస్తోన్న విదేశీ మాజీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. వాళ్ల వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పాడు. అలా ప్రాముఖ్యత ఇచ్చినంత కాలం వాళ్లకు పబ్లిసిటీ పెరుగుతుందన్నాడు.
"చర్చ అనేది బ్యాటింగ్, బౌలింగ్ చుట్టూ ఉండాలి. బ్యాట్స్‌మెన్ బౌల్డ్, ఎల్బీగా ఔటైతే.. పిచ్‌ను ఎలా నిందిస్తారు? ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోన్న విదేశీ ఆటగాళ్లకు మనమెందుకు ప్రాధాన్యం ఇవ్వాలి? వారేం చెప్తున్నారనేది మనమెందుకు చర్చించాలి. భారత్ 36 పరుగులకే ఆలౌటైనప్పుడు.. కపిల్‌దేవ్, సచిన్, గంగూలీ, సెహ్వాగ్ వంటి వాళ్లు అక్కడి పిచ్‌ల గురించి ఏమైనా మాట్లాడారా? అలాంటిదేమీ లేదే. అక్కడి మీడియా మనకెంత మేర ప్రాముఖ్యత ఇచ్చింది. పిచ్‌ల గురించి ఇంగ్లాండ్ బోర్డు కానీ.. కెప్టెన్ రూట్ కానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయినా వారూ భారత పిచ్‌ల గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు."
-సునీల్ గావస్కర్, భారత మాజీ క్రికెటర్
చివరి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్.. మొతేరా పిచ్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. 'తవ్వి ఉన్న నేలపై బ్యాట్ పట్టుకుని ఉన్న అతడి ఫొటోను పంచుకున్నాడు. నాల్గో టెస్టుకు ముందు పిచ్‌కు సంబంధించి సన్నాహాలు సాగుతున్నాయని.. ఇది టెస్టు క్రికెట్‌కు పనికొచ్చే పిచ్ కాదని' వాన్ ట్వీట్ చేశాడు.
మరో ఇంగ్లిష్ క్రికెటర్ మాంటీ పనేసర్ మొతేరా వికెట్‌ను క్లబ్ క్రికెట్ పిచ్‌తో పోల్చాడు. వీరి వ్యాఖ్యలపై తాజాగా గావస్కర్ తనదైన శైలిలో జవాబిచ్చాడు.
ఇదీ చదవండి: 'నీ బౌలింగ్ బాగుంది.. వివాదాల జోలికి వెళ్లకు'