ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మన్ తడబడ్డారు. మూడో రోజు ఆటముగిసేసరికి భారత జట్టు 321 పరుగుల వెనుకంజలో ఉంది. పుజారా(73), పంత్(91) ఇన్నింగ్స్ తోడవ్వడం వల్ల 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది.
ఇలా సాగింది..
తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఆర్చర్బౌలింగ్లో 3.3వ ఓవర్ వద్ద ఓపెనర్ రోహిత్(6) పరుగులు చేసీ కీపర్ బట్లర్‌కు క్యాచు ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శుభమన్ గిల్(29) కూడా ఆర్చర్ బౌలింగ్‌లోనే అండర్సన్ చేతికే చిక్కాడు. దీంతో భారత్ 44 పరుగులు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మొత్తంగా భోజన విరామ సమయానికి 14ఓవర్లకు జట్టు స్కోరు 59/2గా నమోదైంది.
రెండో సెషన్లో క్రీజులోకి వచ్చిన కోహ్లీ(11) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. డామ్ బెస్ వేసిన 25వ ఓవర్ నాలుగో బంతి విరాట్ బ్యాట్ అంచును తాకి షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఓలీ పోప్ చేతుల్లో పడింది. దీంతో భారత్ 71 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానె(1) వెంటనే పెవిలియన్ చేరాడు. ఫలితంగా 73 పరుగులకే నాలుగో వికెట్‌ను చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లోకి పడింది టీమ్ఇండియా. అనంతరం చెతేశ్వర్ పుజారా, పంత్ అర్ధ సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేశారు. మొత్తంగా టీ విరామం సమయానికి స్కోరు 154/4గా నమోదైంది.
మూడో సెషన్లో పుజారా, పంత్ ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షపెట్టారు. 50.4ఓవర్లో 192 పరుగులు వద్ద బెస్ బౌలింగ్‌లో ఔట్ అవ్వగా.. పంత్ 225 పరుగలు వద్ద ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా మూడో రోజు ఆటముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది టీమ్ఇండియా. ప్రస్తుతం క్రీజులో అశ్విన్(8), వాషింగ్టన్ సుందర్(33) ఉన్నారు.ఇంగ్లాండ్ బౌలర్లలో డొమినిక్ బెస్(4), ఆర్చర్(2) వికెట్లు తీశారు. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయింది.