బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని టీమ్ఇండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మహ్మద్ సిరాజ్ (5/73), శార్దూల్ ఠాకూర్ (4/61) సత్తాచాటారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ (55), వార్నర్ (48) టాప్ స్కోరర్లు. అయితే, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నప్పటికీ ఆసీస్ వేగంగా పరుగులు సాధించి ఆధిక్యాన్ని పెంచుకుంది.
ఓవర్ నైట్ స్కోరు 21/0తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ ఓపెనర్లు.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. దాదాపు 20 ఓవర్లు వికెట్ ఇవ్వకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆసీస్ వరుసగా వికెట్లను కోల్పోయింది. 26వ ఓవర్‌లో 89 పరుగుల వద్ద శార్దుల్ బౌలింగ్‌లో ఓపెనర్ హారిస్(38) వికెట్ కీపర్ పంత్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఓవర్లోనే అర్ధశతకానికి చేరువవుతున్న వార్నర్(48)ను సుందర్ బోల్తాకొట్టించాడు. వార్నర్ సమీక్షకు వెళ్లినా ఔట్ అనే తేలింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
అనంతరం 31వ ఓవర్‌లో సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. మూడో బంతికి లబుషేన్(25)ను పెవిలియన్‌కు చేర్చిన సిరాజ్.. ఆఖరి బంతికి మాథ్యూ వేడ్(0)ను ఔట్ చేశాడు. దీంతో భోజన విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
రెండో సెషన్లో..
భోజన విరామం తర్వాత ఆసీస్ అయిదో వికెట్ కోల్పోయింది. అర్ధశతకం సాధించిన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (55)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. బౌన్సర్ అంచనా వేయడంలో విఫలమైన స్మిత్ రహానె చేతికి చిక్కాడు. ఆ తర్వాత గ్రీన్ (37) ఆరో వికెట్‌గా శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో రోహిత్ చేతికి చిక్కాడు. అనంతరం టిమ్ పైన్(27) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీ విరామం పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది ఆసీస్.
మూడో సెషన్లో..
మూడో సెషన్లో క్రీజులోకి వచ్చిన స్టార్క్(1) సిరాజ్ బౌలింగ్‌లో సైనీ చేతికి చిక్కాడు. కమిన్స్(28*) అజేయంగా నిలిచాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసి ఆలౌట్ అయింది ఆసీస్. ఫలితంగా 327 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో సిరాజ్(5) వికెట్లు తీశాడు. తన మూడో టెస్టులోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఠాకూర్(4), సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.