ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి చేరువలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను మరోసారి కట్టడి చేసింది. సోమవారం మూడో రోజు ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా 133/6తో నిలిచింది. దీంతో భారత్ కన్నా 2 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్(17), పాట్ కమిన్స్(15) క్రీజులో ఉన్నారు. ఇక మంగళవారం ఆస్ట్రేలియా టెయిలెండర్లను భారత బౌలర్లు ఎంత త్వరగా ఔట్ చేస్తారనే విషయంపైనే విజయం ఆధారపడింది.
తడబడిన ఆస్ట్రేలియా..
రెండో ఇన్నింగ్స్‌లో భారీ లోటును పూరించి ఈ మ్యాచ్‌లో నిలవాలని చూసిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జో బర్న్స్(4)ను ఉమేశ్ యాదవ్ నాలుగో ఓవర్‌లోనే ఔట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆపై లబుషేన్(28), మాథ్యూ వేడ్(48) కాసేపు వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే, అశ్విన్ వేసిన ఓ చక్కటి బంతికి ప్రమాదకర లబుషేన్ పెవిలియన్ చేరాడు. స్లిప్‌లో రహానె చేతికి చిక్కాడు.
అనూహ్య బంతికి స్మిత్ ఔట్..
తర్వాత వచ్చిన స్మిత్(8) మరోసారి నిరాశపరుస్తూ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. లెగ్‌సైడ్ వెళ్తున్న బంతి.. వికెట్ల అంచున తాకడం వల్ల బెయిల్స్ ఎగిరిపడ్డాయి. అయితే, ఈ విషయాన్ని తొలుత బుమ్రా, స్మిత్ గమనించలేదు. తర్వాత తేరుకుని చూస్తే బెయిల్స్ పడిపోయాయి. దాంతో స్మిత్ వెనుతిరిగాడు. ఈ క్రమంలోనే వేడ్, టిమ్‌పైన్(1), ట్రావిస్ హెడ్(17) ఒక్క పరుగు తేడాలో ఔటయ్యారు. జడేజా.. వేడ్, పైన్‌ను పెవిలియన్ చేర్చగా.. మహ్మద్ సిరాజ్ హెడ్(19)ను బోల్తా కొట్టించాడు. దీంతో ఆసీస్ 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చుంది. అయితే, చివర్లో కామెరూన్, కమిన్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ ఆట నిలిచే సమయానికి జట్టు స్కోరును 133/6కి తీసుకెళ్లారు.
మరో 49 పరుగులకే..
277/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా మరో 49 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. అజింక్యా రహానె(112; 223 బంతుల్లో 12x4) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు రవీంద్ర జడేజా(57; 159 బంతుల్లో 3x4) అర్ధశతకం బాదాడు. టెయిలెండర్లు పెద్దగా రాణించకపోవడం వల్ల భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. దాంతో ఆస్ట్రేలియాపై 131 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. కంగారూ బౌలర్లలో స్టార్క్, లియోన్ 3 వికెట్లు తీయగా, కమిన్స్ 2, హెజిల్‌వుడ్ 1 పడగొట్టారు.