బెంగళూరులో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. స్టీవ్ స్మిత్ (131) శతకం చేయడం వల్ల తొలుత ఆసీస్ 286 పరుగులు చేసింది. షమి (4/63) రాణించాడు. ఛేదనలో భారత్.. రోహిత్‌శర్మ (119), విరాట్ కోహ్లీ (89) చెలరేగడం వల్ల 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. హిట్‌మ్యాన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', కోహ్లీ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కించుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు నమోదయ్యాయి.
- అన్నిఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత సారథిగా విరాట్ కోహ్లీ (11,208) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ధోనీ (11,207) పేరిట ఉండేది. అయితే ధోనీ 330 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా.. కోహ్లీ 199 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత అందుకున్నాడు.
- ధోనీ పేరిట ఉన్న మరో రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు పూర్తిచేసిన భారత సారథిగా రికార్డు సృష్టించాడు. ధోనీ 127 ఇన్నింగ్స్‌ల్లో 5వేల పరుగుల మైలురాయి అందుకోగా రికార్డుల రారాజు 82 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు.
- వన్డేల్లో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'లు దక్కించుకున్న జాబితాలో కోహ్లీ (8) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గేల్, షాన్ పొలాక్ సరసన కోహ్లీ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (14), జయసూర్య (11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్‌శర్మ (29) రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో సచిన్ తెందూల్కర్ (49), కోహ్లీ (43), రికీ పాంటింగ్ (30) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అయిదో స్థానంలో సనత్ జయసూర్య (28) ఉన్నాడు.
- వన్డేల్లో అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని సాధించిన మూడో క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ (217) నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ (194), డివిలియర్స్ (208) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోహిత్ తర్వాతి స్థానాల్లో గంగూలీ (228), సచిన్ (235), లారా (239) ఉన్నారు.
- వన్డేల్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు సాధించిన మూడో జోడీగా రోహిత్-కోహ్లీ (18) నిలిచారు. ఈ జాబితాలో సచిన్-గంగూలీ (26), దిల్షాన్-సంగక్కర (20) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- గత ఏడాది జనవరి నుంచి డెత్ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా షమి (19) రికార్డు నెలకొల్పాడు. ముస్తాఫిజుర్ (22) తొలి స్థానంలో ఉన్నాడు.