లాక్డౌన్ రెండు వైపుల పదునున్న కత్తిలాగా మారిందని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమి. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడం సహా సుదీర్ఘ విరామం వల్ల ఫిట్నెస్ గాడి తప్పే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశాడు.
నగరాల్లో నివసించే భారత ఆటగాళ్లతో పోలిస్తే తాను కచ్చితంగా ప్రయోజనం పొందాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు షమి. తన స్వస్థలమైన సహస్పుర్లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాని.. మినీ క్రికెట్ మైదానంలో నెట్ ప్రాక్టీస్ కోసం పూర్తి సౌకర్యంగా ఉందని అన్నాడు షమి.
రెండువైపుల పదునున్న కత్తిలా..
"లాక్డౌన్లో రెండు రకాల దారులు ఉన్నాయి. ఏడాదంతా విరామం లేకుండా టీమ్ఇండియా అనేక సిరీస్‌లలో పాల్గొంది. ఆటగాళ్లకు ఇదొక విశ్రాంతి సమయంలా భావించవచ్చు. మరో విధంగా ఆలోచిస్తే ఈ విరామంలో ప్రాక్టీస్‌తో శారీరకంగా ఫిట్ ఉండొచ్చు. కానీ, క్రికెట్ మ్యాచ్‌లు ఆడక పోవడం వల్ల ఆటలో పట్టు తప్పుతుంది. ఇదే అసలైన వ్యత్యాసం. ఈ లాక్డౌన్లో లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయ"ని తెలిపాడు మహ్మద్ షమి. ఒకవేళ బీసీసీఐ శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తే ఇన్నిరోజులుగా చేసిన ప్రాక్టీస్ కలిసి వస్తుందని షమి అభిప్రాయపడ్డాడు. లాక్డౌన్లో గాయాల నుంచి కోలుకున్నట్లు.. ప్రస్తుతం తన బౌలింగ్ తీరు బాగుందని తెలిపాడు.
'లాలాజలం' వాడటం లేదు
లాలాజలం లేకుండా ఎర్రబంతి ఎలా ప్రవర్తిస్తుందో తానింకా అంచనా వేయలేదని తెలిపాడు షమి. తన సోదరుడితో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ ట్రైనింగ్‌లో పాత బంతితో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారా? అనే ప్రశ్నకు చేయలేదంటూ సమాధానమిచ్చాడీ పేసర్. లాక్డౌన్ తర్వాత బౌలింగ్ చేసే తీరులో మార్పు వచ్చిందని అన్నాడు షమి. విరామం తర్వాత మొదటిసారి బౌలింగ్ చేసే ప్రయత్నంలో బంతికి లాలాజలం పూసే అలవాటుతో చేయి అటుగా సాగిందని.. ఆ తర్వాత నిబంధనలను గుర్తు చేసుకుని బంతికి లాలాజలం లేకుండా ప్రాక్టీస్ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే అలా బౌలింగ్ చేసినప్పుడు బంతి స్వింగ్ అవుతుందా అనే ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదని స్పష్టం చేశాడు.