సిడ్నీలో మహిళల టీ20 ప్రపంచకప్ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనుంది. గురువారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకూ ఫైనల్ చేరని టీమిండియా.. ఇంగ్లీష్ జట్టుపై గెలిచి తుది పోరుకు చేరుకోవాలని పట్టుదలతో ఉంది. టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న షెఫాలీపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఈ ప్రపంచకప్‌లో చిన్న లక్ష్యాలను కూడా కాపాడుకున్న టీమిండియా.. మరోసారి బౌలర్లపై ఆశలు పెట్టుకుంది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ రాణిస్తే ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడం పెద్ద సమస్య కాదని భారత్ భావిస్తోంది. ఈ టోర్నీలో 9 వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న పూనమ్.. మరోసారి తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాలని హర్మన్‌ప్రీత్ సేన కోరుకుంటోంది. శిఖా పాండే, రాధాయాదవ్, రాజేశ్వరీ కూడా రాణిస్తే.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్‌ను కట్టడి చేయొచ్చని భారత జట్టు భావిస్తోంది.
పూనమ్ కోసం ప్రణాళికలు
2018 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌పై గెలిచిన ఇంగ్లాండ్.. ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలన్న పట్టుదలతో సెమీస్‌కు సిద్ధమైంది. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టిందీ ఇంగ్లీష్ జట్టు. ప్రపంచకప్‌లో భారత్‌పై వీరికి ఘనమైన రికార్డు ఉంది. ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లాండ్ ఐదుసార్లు తలపడగా... అన్ని సార్లు ఇంగ్లీష్ జట్టే గెలిచింది. ఈ టోర్నీలో 3 అర్ధ సెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్న నటాలీ.. మరోసారి సత్తా చాటాలని ఇంగ్లాండ్ కోరుకుంటోంది.
నటాలీని త్వరగా అవుట్ చేయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్ విభాగంలోనూ ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. బౌలర్ సోఫీ ఎకెల్‌స్టోన్, పేసర్ అన్య ష్రబ్సోల్ ప్రదర్శన ఇంగ్లాండ్‌కు కీలకంగా మారనుంది. పూనమ్ యాదవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించామని సారధి హేదర్ నైట్ తెలిపింది. భారత బ్యాటర్ షెఫాలీ.. ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎకెల్‌స్టోన్ మధ్య రసవత్తర పోరుకు ఈ మ్యాచ్ వేదిక కానుంది.
తుది జట్లు
భారత్:
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, శిఖా పాండే, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, తానియా భాటియా (కీపర్), రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, హర్లీన్ డియోల్, రాజేశ్వరి గైక్వాడ్.
ఇంగ్లాండ్:
హేదర్ నైట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, కేథరిన్ బ్రంట్, కేట్ క్రాస్, ఫ్రెయా డేవిస్, సోఫీ ఎకెల్‌స్టోన్, జార్జియా ఎల్విస్, సారా గ్లెన్, అమీ జోన్స్ (కీపర్), నటాలీ, అన్య ష్రబ్సోల్, మాడి విల్లియర్స్, ఫ్రాన్ విల్సన్, లారెన్ విన్‌ఫీల్డ్, డానీ వ్యాట్.
ఇదీ చూడండి.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌లో క్వార్టర్స్‌కు సాక్షి