ఐపీఎల్లో ఆడే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఆరు రోజులు క్వారంటైన్ అవసరం లేదని అన్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛైర్మన్ సంజీవ్ చురివాలా. స్టార్ ప్లేయర్లు ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా), మొయిన్ అలీ(ఇంగ్లాండ్) ఐపీఎల్లో మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటారని తెలిపాడు. సెప్టెంబర్ 4 నుంచి 16 వరకు ఇంగ్లాండ్‌లో ఆసీస్ మూడేసి టీ20లు, వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 19న యూఏఈలో ఐపీఎల్ ఆరంభమవుతుండగా.. 17న ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్, ఆసీస్ ఆటగాళ్లు ఇక్కడికి చేరుకుంటారు.
"ఇంగ్లాండ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు బయో బబుల్‌లో ఉంటూనే మ్యాచ్‌లు ఆడుతుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో తీసుకొస్తాం కాబట్టి మిగతా ఆటగాళ్ల మాదిరే సురక్షితంగా ఉంటారు. అయితే యూఏఈలో అడుగుపెట్టగానే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. భద్రత విషయంలో రాజీపడబోం" అని సంజీవ్ వివరించాడు.
బీసీసీఐ కచ్చితమైన నిబంధనలు..
సెప్టెంబర్ 19న యూఏఈలో ప్రారంభంకానున్న ఐపీఎల్ కోసం బీసీసీఐ రూపొందించిన ఎస్ఓపీని.. అన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరిగా అనుసరించనున్నాయి. దుబాయ్‌లో అడుగుపెట్టగానే ఆటగాళ్లంతా ఆరు రోజులు క్వారంటైన్లో ఉండాలి. మూడుసార్లు కొవిడ్-19 టెస్టులు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో నెగటివ్ వస్తేనే బయో బబుల్‌లోకి ప్రవేశం కల్పిస్తారు. దాంతో పాటు ప్రతి ఐదు రోజులకు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో జట్టు ఒక్కో హోటల్ లేదా రిసార్ట్స్‌ను పూర్తిగా బుక్ చేసుకున్నాయి. హోటల్లో పనిచేసే మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేసిన తర్వాతే బుడగలోకి అనుమతిస్తారు. బస్సు, కారు డ్రైవర్లు కూడా బయో బబుల్ లోపలే ఉండాలి.