కోహ్లీ నేతృత్వంలోని టీమ్ఇండియా, భారత-ఏ జట్టు విదేశీ గడ్డపై తలపడితే ఎలా ఉంటుంది? ఊహిస్తే బాగుంది కదూ.. అయితే వీక్షించడానికి సిద్ధమైపోండి. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జులైలో ఈ ఇరుజట్లు పోటీపడనున్నాయి.
ఆగస్టు-సెప్టెంబరు మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. ఈ మ్యాచులకు ముందు నాలుగు రోజులు సాగే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది భారత జట్టు. ఇందులోనే భారత్-ఏ జట్టుతో తలపడనుంది. జులై 21న నార్తంప్టన్‌షైర్, జులై 28న లీసెస్టర్‌షైర్ వేదికగా ఇవి జరుగుతాయి. ఈ విషయాన్ని నార్తంప్టన్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తెలిపింది. క్రికెట్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఈ ప్రాక్టీసు మ్యాచ్‌లు ముగియగానే ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్-భారత్ తొలి టెస్టు ప్రారంభమవుతుంది. మిగతా టెస్టులు.. రెండు(ఆగస్టు 12-16), మూడు(ఆగస్టు 25-29), నాలుగు(సెప్టెంబరు 2-6), ఐదు(సెప్టెంబరు 10-14) తేదీల్లో జరుగుతాయి.
ఇదీ చూడండి: 'నాపై రవిశాస్త్రి.. సిరాజ్‌పై నేను విరుచుకుపడాల్సిందే'