'సెహ్వాగ్ కన్నా అతడు మంచి ప్లేయర్ కానీ బుర్రలేదు' - పాక్ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ సెహ్వాగ్ అక్తర్
పాక్ మాజీ క్రికెటర్ నజీర్‌కు అద్భుతమైన ప్రతిభ ఉన్నా, సరైన ఆలోచన విధానం లేదని అన్నాడు ఆ దేశ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. భారత మాజీ ఆటగాడు సెహ్వాగ్‌ను అతడితో పోల్చి ఈ వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్.. తమ దేశానికే చెందిన మాజీ ఆటగాడు ఇమ్రాన్ నజీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తను భారత్‌కు చెందిన సెహ్వాగ్ కంటే ప్రతిభవంతుడైనా, వీరేందర్‌కు ఉన్న ఆలోచన విధానం నజీర్‌కు లేదని అభిప్రాయపడ్డాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో పంచుకున్నాడు.
"ఇమ్రాన్ నజీర్‌కు ఉన్న టాలెంట్ సెహ్వాగ్‌కు లేదు. అయితే సెహ్వాగ్‌కు ఉన్న బుర్ర నజీర్‌కు లేకుండా పోయింది. తన కెరీర్ ప్రారంభంలో భారత్‌పై మ్యాచ్ తర్వాత నిలకడగా ఆడాలని సూచించాను. కానీ నా మాటల్ని పట్టించుకోలేదు. దురదృష్టవశాత్తు నజీర్ సేవల్ని పాక్ ఎక్కువ కాలం వినియోగించుకోలేకపోయింది. అయితే సెహ్వాగ్ కంటే అతడు మంచి ఆటగాడు, ఫీల్డర్" -షోయబ్ అక్తర్, పాక్ మాజీ పేసర్
1999లో పాక్ తరఫున అరంగేట్రం చేసిన ఇమ్రాన్.. భారత్‌తో మ్యాచ్‌లో విధ్వంసక శతకం బాదాడు. దీంతో అతడు తిరుగులేని బ్యాట్స్‌మన్ అవుతాడని ఆ దేశ మాజీ క్రికెటర్లు భావించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలో నజీర్ కెరీర్ గాడి తప్పింది. కెరీర్లో 8 అంతర్జాతీయ టెస్టులు, 79 వన్డేలు, 25 టీ20లు మాత్రమే ఆడి, 2,822 పరుగులు చేశాడు. సెహ్వాగ్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో 17,253 పరుగులు చేశాడు.