టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌కు చేరితే.. ఈ ఏడాది జూన్‌లో జరగాల్సిన ఆసియా కప్ వాయిదా పడుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ ఎహ్సాన్ మణి అభిప్రాయపడ్డాడు.
"ఆసియా కప్ షెడ్యూల్‌ను గత సంవత్సరమే నిర్ణయించినప్పటికీ.. ప్రస్తుతానికి ఆ టోర్నీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ను నిర్వహించాల్సి ఉంది. భారత్ కనుక ఫైనల్ చేరితే.. ఆసియా కప్ జరగకపోవచ్చు. ఈ దఫా టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఆ సిరీస్‌ను 2023కు వాయిదా వేయడం మంచిది."
-ఎహ్సాన్ మణి, పీసీబీ ఛైర్మన్.
"ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు భారత్ అర్హత సాధించవచ్చు. దీంతో శ్రీలంకలో తలపెట్టిన ఆసియా కప్ ఆగిపోయేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై మాకింకా స్పష్టత లేనప్పటికీ.. టోర్నీ జరిగే సూచనలు మాత్రం కనిపించడం లేదు." అని పీసీబీ సీఈఓ వసీం ఖాన్ తెలిపాడు.
వీసాలపై హామీ ఇవ్వండి..
ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ గురించి కూడా పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి స్పందించాడు. తమకు వీసాల మంజూరు విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఐసీసీకి ఒక లేఖ కూడా రాశాడు.
"ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో టీ20 ప్రపంచ కప్ నిర్వహించనున్నారు. మా అభిమానులు, జర్నలిస్టులు, ఆటగాళ్లకు భారత్ నుంచి వీసాల మంజూరు విషయంలో మాకొక లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాల్సిందిగా ఐసీసీని కోరుతున్నాం. తదుపరి ఐసీసీతో ఉన్న సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ఒకవేళ భారత్ హామీ ఇవ్వలేకపోతే ప్రపంచకప్ వేదికను యూఏఈ వంటి మరో దేశానికి మార్చాలి."
-ఎహ్సాన్ మణి, పీసీబీ ఛైర్మన్.
మార్చి 31లోపు వీసాల విషయంపై తేల్చాల్సి ఉందని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: టెస్టు ర్యాంకింగ్స్: రోహిత్ కెరీర్ బెస్ట్, అశ్విన్@3