నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)పై ఇటీవల వస్తున్న విమర్శలపై ఐసీసీ స్పందించింది. బాల్ ట్రాకింగ్ విధానం 100 శాతం సరైనది కాదని పేర్కొంటూనే.. క్రికెట్లో 'అంపైర్స్ కాల్' నిబంధన తప్పనిసరి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తన సిఫార్సును వచ్చే వారం సమావేశం కానున్న పాలకమండలి ముందు ఉంచనుంది ఐసీసీ. మార్చి 30న జరగబోయే త్రైమాసిక సమావేశానికి ముందు ఈ విషయం చర్చకు వస్తుందని వెల్లడించింది. దీంతో పాటు ఐసీసీ సీఈఓ మనూ సాహ్నీ భవితవ్యంపైనా చర్చించే అవకాశం ఉందని తెలిపింది.
ఈ పాలక మండలి అధ్యక్షుడిగా భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఉన్నాడు. సభ్యులుగా ఆయా దేశాల మాజీ క్రికెటర్లు ఆండ్రూ స్ట్రాస్, రాహుల్ ద్రవిడ్, మహేల జయవర్ధనే, షాన్ పొలాక్తో పాటు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగాల్లె, అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్, మికీ ఆర్తర్ ఉన్నారు. వీరు మ్యాచ్ అధికారులు, ప్రసార దారులు, బాల్ ట్రాకింగ్ సరఫరాదారు అయిన హాక్ ఐ నుంచి సలహాలు తీసుకున్నారు.
క్రికెట్లో డీఆర్ఎస్ విధానం మొదలైనప్పటి నుంచి అంపైర్స్ కాల్ అంశం చర్చనీయాంశంగా మారింది. చాలా మంది మాజీ ఆటగాళ్లు ఈ విధానాన్ని తొలగించాలని కోరారు. ఇటీవలే అంపైర్ నితిన్ మేనన్తో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో కోహ్లీ టాప్- టీ20ల్లో ఫోర్త్