ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా ఫిబ్రవరి 21 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. తొలి కప్పు కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న భారత మహిళా జట్టు.. ఈసారి భారీ ఆశలతోనే బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా టోర్నీ విశేషాలేంటో ఓసారి చూద్దాం..
- పురుషుల తొలి టీ20 ప్రపంచకప్ (2007) జరిగిన రెండేళ్లకు.. మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను ఆరంభించింది ఐసీసీ. 2009లో జరిగిన తొలి టోర్నీలో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
- ఈ ఏడాది చివర్లో పురుషుల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియానే.. మహిళల టోర్నీనీ నిర్వహిస్తోంది. పది జట్లు పోటీ పడే ఈ టోర్నీ.. ఫిబ్రవరి 21న మొదలై మార్చి 8న ముగుస్తుంది. మెగా ఈవెంట్లో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి.
- ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టు మాత్రమే కాదు.. టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ కావడం, మంచి ఫామ్‌లో ఉండటం.. తాజాగా భారత్, ఇంగ్లాండ్‌లతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ విజేతగా నిలవడం వల్ల టైటిల్‌కు హాట్ ఫేవరెట్‌గా కంగారూ జట్టును భావిస్తున్నారు.
- ఫిబ్రవరి 21న ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఆరంభ మ్యాచ్‌కు సిడ్నీ ఆతిథ్యమివ్వనుండగా.. మార్చి 8న మెల్‌బోర్న్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
- రెండేళ్ల క్రితం కప్పు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోని 15 మందిలో... 13 మంది ప్రస్తుత టోర్నీలోనూ బరిలోకి దిగుతున్నారు.
ఫార్మాట్ ఇలా..
టోర్నీలో పోటీ పడుతున్న పది జట్లలో అయిదేసి జట్లను ఎ, బి గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో సాగుతుంది. గ్రూప్‌లో ప్రతి జట్టూ మిగతా నాలుగు జట్లలో ఒక్కో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
తొలిసారి మిథాలీ లేకుండా..
టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి భారత జట్టు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ లేకుండా బరిలోకి దిగుతోంది. 2009లో తొలి ప్రపంచకప్ నుంచి వరుసగా ఆరు టోర్నీల్లోనూ ఆమె బరిలోకి దిగింది. అయితే గత కప్పులో సెమీఫైనల్‌కు మిథాలీని తుది జట్టులోకి తీసుకోకపోవడం దుమారం రేపింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో మిథాలీ ఉంటే భారత్ గెలిచేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది ఆమె టీ20లకు గుడ్‌బై చెప్పింది. గత టోర్నీలో సారథిగా వ్యవహరించిన హర్మన్‌ప్రీతే ఈసారి కూడా జట్టును నడిపించనుంది.
>> ఈసారి టోర్నీలో ఆడనున్న థాయిలాండ్‌కు ఇదే తొలి టీ20 ప్రపంచకప్.
>> ఇప్పటిదాకా ఆరు మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నిల్లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ నాలుగు టైటిళ్లు (2010, 2012, 2014, 2018) సాధించింది. ఇంగ్లాండ్ (2009), వెస్టిండీస్ (2016) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.
>> ఈ సారి మహిళల టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 150 మంది అమ్మాయిలు ఆడనుండగా.. అందులో వివిధ జట్లలోని 14 మంది 2009లో తొలి టోర్నీ నుంచి ఆడుతూ.. ఏడో కప్పులో బరిలోకి దిగుతుండటం విశేషం.
>> టీ20 ప్రపంచకప్‌లో అత్యధికంగా 32 మ్యాచ్‌లు ఆడిన ఘనత ఆస్ట్రేలియాదే. ఈ 32 మ్యాచ్‌ల్లోనూ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ బరిలోకి దిగడం విశేషం.
టీ20 ప్రపంచకప్:
>> ఆరంభం: ఫిబ్రవరి 21
>> ఫైనల్: మార్చి 8
మొత్తం జట్లు: 10
గ్రూప్-ఎ భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్
గ్రూప్-బి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, థాయ్‌లాండ్
టోర్నీలో భారత జట్టు అత్యుత్తమంగా సెమీఫైనల్ వరకు వెళ్లింది. 2009, 2010, 2018 టోర్నీల్లో సెమీస్ చేరిన భారత్.. ఆ దశలోనే నిష్క్రమించింది.
ఇదీ చూడండి.. ఆసియా టీమ్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కాంస్యం