టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లడనున్నట్టు సోమవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముఖ్య నిర్వాహక అధ్యక్షుడు మను సావ్నే తెలిపాడు. వారితో చర్చించి టోర్నీ ప్రణాళికపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పాడు.
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ కూడా రద్దవుతుందన్న వాదనలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఏప్రిల్ 23న నిర్వహించే ముఖ్య కార్యనిర్వాహకుల సమావేశంలో నిర్ణయం వెలువడనుంది.
"ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిపుణులు, ఆస్ట్రేలియా ప్రభుత్వ సలహా మేరకు పురుషుల టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలనుకుంటున్నాం. దీని కోసం మాకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని ఉపయోగించుకుంటాం."
-- మను సావ్నే, ఐసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాయిదా పడిన క్రీడా టోర్నీలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. దాంతో ఐపీఎల్, సూపర్ లీగ్, ఎల్ ఏ లిగ్ వంటి అన్ని టోర్నమెంట్ల పునఃప్రారంభ తేదిల్లో స్పష్టత లేదు.
ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది జరుగుతుందా?