కరోనా వైరస్ ధాటికి రెండు నెలల కిందట్నుంచి ప్రపంచ క్రికెట్ స్తంభించి పోయింది. సిరీస్‌లు, టోర్నీలు ఇప్పుడిప్పుడే మొదలయ్యేలా లేవు. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మీదా కరోనా ప్రభావం తప్పేట్లు లేదు. ఆ టోర్నీ యథావిధిగా జరగడం సందేహంగానే ఉంది. ఈ విషయమై కొన్నాళ్లుగా కిందా మీదా పడుతున్న ఐసీసీ.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన రోజు రానే వచ్చింది. గురువారం జరిగే బోర్డు సమావేశంలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌పై నిర్వహణపై ఏదో ఒకటి తేల్చేయనుంది. పొట్టి కప్పు వాయిదా పడితే ఐపీఎల్ జరిపించేద్దామని చూస్తున్న బీసీసీఐ.. ఆ దిశగా సభ్య దేశాల మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. మరి ఈ రోజు ఐసీసీ ఏం తేల్చబోతోంది?
ప్రపంచ క్రికెట్లో గురువారం కీలక పరిణామం చోటు చేసుకోనుంది. టీ20 ప్రపంచకప్ వాయిదా.. ఐపీఎల్ భవితవ్యంపై ఐసీసీ బోర్డు సమావేశం స్పష్టత ఇవ్వనుంది. కరోనా మహమ్మారి విజృంభణ.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వ్యూహాల నేపథ్యంలో పొట్టి కప్పు వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతుండటం వల్ల ఆ తేదీల్లో టోర్నీ నిర్వహించడం దాదాపు అసాధ్యంలా కనిపిస్తోంది. ఈ టోర్నీ వాయిదా పడితే.. కరోనా కారణంగా వేసవిలో నిర్వహించలేకపోయిన ఐపీఎల్‌ను అక్టోబరు-నవంబరు మధ్య జరిగిపించాలని బీసీసీఐ చూస్తోంది. ఈ దిశగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఐసీసీలో గట్టిగానే చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో మెజారిటీ సభ్య దేశాలు టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయడానికే ఐసీసీ సమావేశంలో మొగ్గు చూపే అవకాశముంది.
"గురువారం జరిగే ఐసీసీ సమావేశంలో టీ20 ప్రపచంకప్ వాయిదా దిశగా నిర్ణయం తీసుకోవడం ఖాయం. అయితే ఆ విషయాన్ని ఇప్పుడే ప్రకటిస్తారా? లేదా? అన్నదే ప్రశ్న. ప్రస్తుతం పొట్టి కప్పుపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు మిగతా అగ్ర బోర్డులు కప్పు కోసం పట్టుబట్టే అవకాశాలు లేవు" అని ఐసీసీ బోర్డు సభ్యుడు తెలిపాడు. మరోవైపు ప్రపంచకప్ పనులు కొనసాగుతున్నాయని చెప్తూనే.. కరోనా మహమ్మారితో వేగంగా మారుతున్న ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రణాళికలు మారొచ్చని తెలిపింది.
ఇప్పుడు లేదంటే 2022లో!
అక్టోబరు-నవంబరులో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేయాలని అత్యధిక సభ్య దేశాలు ప్రతిపాదిస్తున్నాయి. వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరు నెలల్లో జరగాల్సిన 2021 పొట్టి కప్పునకు భారత్ యథావిధిగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ లెక్కన ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో ఐపీఎల్, ఫిబ్రవరి- మార్చిలో టీ20 ప్రపంచకప్, ఏప్రిల్-మే నెలల్లో 2021 ఐపీఎల్ షెడ్యూల్ ఉంటాయి. ఐసీసీ టోర్నీలు, ఐపీఎల్ ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ దగ్గరే ఉన్నాయి. ఆర్నెల్ల వ్యవధిలో మూడు మెగా టోర్నీల నిర్వహణ వ్యాపార కోణంలో విజయవంతమవుతుందా అన్న సందేహం లేకపోలేదు. ఒకే ఏడాది రెండు టీ20 ప్రపంచకప్‌లు నిర్వహించినా బాగుండదు. ఈ నేపథ్యంలో 2020 టీ20 ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేయాలన్న డిమాండ్ బోర్డుల నుంచి వినిపిస్తోంది.
దాదా చాణక్యం
నిజానికి కరోనా వైరస్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌పై బీసీసీఐ ఆశలు సన్నగిల్లాయి. ప్రపంచకప్ నిర్వహణపైనా అనిశ్చితి నెలకొన్నా.. ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ అదుపులో ఉండటం వల్ల ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించడంపై ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సంప్రదింపులు కొనసాగించాయి. అయితే ప్రేక్షకులు లేకుండా క్రీడా సముదాయాలు, స్టేడియాలు తెరుచుకోవచ్చంటూ భారత ప్రభుత్వం నాలుగో దశ లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడం వల్ల గంగూలీ రంగంలోకి దిగాడు. వేల కోట్ల ఆదాయం తెచ్చే ఐపీఎల్‌ను ఎలాగైనా నిర్వహించాలన్న కృతనిశ్చయంతో పావులు కదిపాడు. ఐసీసీలోని సభ్య దేశాలను మచ్చిక చేసుకున్నాడు. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రతిపాదనతో దక్షిణాఫ్రికా బోర్డును దారిలోకి తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా పర్యటనపై సందిగ్ధతకు తెరదించాడు. ఐసీసీ సమావేశానికి ఒక రోజు ముందు టీమ్‌ఇండియా-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను సీఏ ప్రకటించడం గమనార్హం.
ఐసీసీ ఛైర్మన్ రేసులో తానున్నానని సంకేతాలు ఇవ్వడం ద్వారా.. ప్రస్తుత ఛైర్మన్ శశాంక్ మనోహర్ అనుకున్న దాని కంటే ముందే కుర్చీని వీడాల్సిన పరిస్థితిని కల్పించింది గంగూలీనే. తన వారసుడిగా ఇంగ్లాండ్ బోర్డు మాజీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్‌ను తీసుకొచ్చి, మరో మూడు నెలలు పదవీ కాలం పొడిగించుకోవాలని మనోహర్ భావించాడు. కరోనా కారణంగా స్తబ్దత నెలకొనడం వల్ల మనోహర్ కొనసాగింపు లాంఛనమే అనుకున్నారంతా! అయితే గంగూలీ చాణక్యంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మంగళవారం మొదలవ్వాల్సిన ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. "కొత్త ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించడానికి మంగళవారం ఐసీసీ సమావేశమైంది. అయితే ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. గురువారం జరిగే ఐసీసీ భేటీలో ఎన్నిక ప్రక్రియపై చర్చిస్తారు. పదవీ కాలం పొడిగింపు వద్దని మనోహర్ కోరాడు. కొత్త ఛైర్మన్ ఎన్నికకు సహకరిస్తానని తెలిపాడు" అని ఐసీసీ పేర్కొంది.
ఇదీ చూడండి... అడిలైడ్ వేదికగా భారత్-ఆసీస్ డేనైట్ టెస్టు!