'డక్వర్త్ లూయిస్' విధానం సృష్టికర్తల్లో ఒకరైన టోనీ లూయిస్.. బుధవారం(ఏప్రిల్ 1), 78 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయమై విచారం వ్యక్తం చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. క్రికెట్కు టోనీ అందించిన సహకారం మరవలేనిదని, ఏళ్ల పాటు గుర్తుంటుందని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అల్లార్డైస్ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని గణిత, గణాంక శాస్త్రాల్లో పట్టా పొందిన లూయిస్.. ఫ్రాంకిన్ డక్వర్త్తో కలిసి ఈ విధానాన్ని రూపొందించారు. దీనిని 1999 నుంచి క్రికెట్లో అమలు పరుస్తోంది ఐసీసీ. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం పడితే.. ఈ విధానంలో లెక్కగట్టి, ప్రత్యర్థికి లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. అన్ని ఫార్మాట్లలో ఇది ప్రస్తుతం అమల్లో ఉంది.