కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సహా ప్రధాన క్రికెట్ టోర్నమెంట్లకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి శుక్రవారం ఐసీసీ బోర్డు చర్చించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో భారత్ తరఫున బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పాల్గొన్నాడు.
కరోనా కారణంగా అనేక ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కూడా రద్దయ్యే ప్రమాదంలో పడ్డ సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా క్రీడారంగంపై కరోనా చూపిస్తోన్న ప్రభావం గురించి చర్చించాం అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. టీ20 ప్రపంచకప్ సహా టోర్నీల వేదికల మార్పు లేదా వాయిదా గురించి ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి అందుబాటులో ఉన్న అని ప్రత్యామ్నాయాలను ఐసీసీ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తుంది అని ఐసీసీ చెప్పింది. పాకిస్థాన్, వెస్టిండీస్‌లతో సిరీస్‌లకు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వలేకపోతే పరిస్థితేంటి అని ఓ ఐసీసీ సభ్యుణ్ని అడిగితే.. పాయింట్లు ఎలా ఇవ్వాలనే విషయాన్ని సాంకేతిక సంఘానికి నివేదిస్తామని చెప్పాడు. ఇంకా చాలా సమయం ఉన్నందున అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు కరోనాతో ముప్పు లేదని కొందరు సభ్యులు అభిప్రాయడ్డారు.