టీ20 ప్రపంచకప్‌పై గురువారం ఐసీసీ బోర్డు సమావేశంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ప్రపంచకప్ సహా అజెండాలోని అన్ని అంశాలపైనా నిర్ణయాన్ని జూన్ పదో తేదీకి వాయిదా వేసింది. శశాంక్ మనోహర్ నేతృత్వంలో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన బోర్డు.. ఐసీసీ వ్యవహారాల్లో గోప్యత లేకపోవడంపై ఆందోళన వ్యక్తంజేసింది.
"ఐసీసీ పరిణామాలపై అనేక మంది బోర్డు సభ్యులు తమ ఆందోళన తెలియజేశారు. అత్యున్నత నిర్ణాయక మండలి ప్రమాణాలకు అనుగుణంగా ఐసీసీ పవిత్రత, గోప్యతపై తక్షణం దృష్టిసారించాలని కోరారు. ఐసీసీ విలువల కమిటీ అధికారి సారథ్యంలో తక్షణం స్వతంత్ర దర్యాప్తునకు బోర్డు ఆదేశించింది. జూన్ 10న జరిగే సమావేశంలో ఐసీసీ సీఈఓ ఈ విచారణ పురోగతిని బోర్డుకు తెలియజేస్తాడు. కరోనా మహమ్మారితో వేగంగా మారుతున్న ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్ ప్రణాళికలపై సభ్య దేశాలతో చర్చలు కొనసాగించాలని ఐసీసీకి బోర్డు విజ్ఞప్తి చేసింది"
-- ఐసీసీ
మాకు ఓ అవకాశం ఇవ్వండి..
మరోవైపు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా తమకు 2020 టీ20 ప్రపంచకప్‌కు బదులుగా.. 2021 టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశమివ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా.. ఐసీసీని కోరినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో ఈ మెగాటోర్నీని నిర్వహించే వీలులేదని పలువురు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం యదావిథిగా జరపాలని కోరుతున్నారు.