ఐసీసీ టెస్టు క్రికెట్లో చేయబోయే మార్పులు, చేర్పుల గురించి అభిమానులతో పంచుకుంది. సలహాలు సైతం తెలియజేయాలని కోరింది. యువతను క్రికెట్ వైపు ఆకర్షించేందుకు ఈ నూతన విధానాలను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇవి అమల్లోకి తీసుకొస్తే 2019 జులై నుంచి 2021 జూన్ మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఈ కొత్త పద్ధతులను అనుసరించనున్నారు. క్రికెట్నాట్యాజ్యునోఇట్(#CricketNotAsYouKnowIt) హ్యాష్‌టాగ్‌తో వీటిని పోస్టు చేసింది. కానీ... ఇవాళ ఏప్రిల్ 1( ఫూల్స్ డే) అని మరచిపోవద్దు.
- జెర్సీలపై ఇన్‌స్టా.. పేర్లు
యువత కోసం క్రికెట్‌ను మరింత అందంగా మార్చేందుకు.. ఆటగాళ్ల జెర్సీలపై నెంబర్లతో పాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల పేర్లను ఉంచనుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి దీనిని అమలులోకి తీసుకురానున్నారు.
- ట్విట్టర్ పోల్‌తో టాస్
వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాత విధానం మాదిరి టాస్ వేయడానికి స్వస్తి పలకనున్నారు. టాస్‌కు బదులుగా ట్విట్టర్ పోల్ నిర్వహించనున్నారు. దీని వల్ల అభిమానులే ఎవరు మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయాలన్నది నిర్ణయించే అవకాశం ఉంటుంది.
- పొట్టి దుస్తులతో...
ఇప్పటివరకు ఎలాంటి వాతావరణమైనా పొడవాటి జెర్సీలనే ఉపయోగించేవారు. కానీ నూతన నిబంధనల ప్రకారం ఎండ తీవ్రత 35డిగ్రీల సెల్సియస్ దాటినపుడు ఆటగాళ్లు షార్ట్స్ ధరించి ఆడే అవకాశాన్ని కల్పించనుంది ఐసీసీ.
- ఆటగాళ్ల పక్కనే కామెంటరీ
ఇప్పటి వరకు వ్యాఖ్యాతలు స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏసీ గదుల్లో కూర్చుని కామెంటరీ చెప్పేవారు. తాజా ఐసీసీ ప్రతిపాదన ప్రకారం వారు నేరుగా మైదానంలోకి వెళ్లి మ్యాచ్ జరుగుతుంటే స్లిప్ ఫీల్డర్ వెనకాల నిలబడి వ్యాఖ్యానించొచ్చు.
- ఒక బంతికి రెండు వికెట్లు
ఒక బంతికి ఒక ఔట్ మాత్రమే ఉండేది ఇప్పటివరకు.. కొత్త విధానంలో ఒకే బాల్‌కు రెండు వికెట్లు తీయొచ్చు. బ్యాట్స్‌మెన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న తర్వాత నాన్ స్ట్రైకర్ బ్యాట్స్‌మెన్‌ను రనౌట్ చేసే వీలుంటుంది.
- పేర్లు మార్పు
క్రికెట్ పదజాలంలోనూ మార్పులు తీసుకొస్తున్నారు. నోబాల్‌ను ఫాల్ట్ గానూ, డాట్ బాల్‌ను ఏస్గానూ పిలవనున్నారు.
- ఫోర్ అంటే 8, సిక్స్ అంటే 12...
డేనైట్ టెస్టులను ఆసక్తికరంగా మార్చడానికి సాయంత్రం సెషన్ బ్యాటింగ్ చేసే జట్టుకు రెట్టింపు పరుగులు ఇచ్చే అంశంపైనా ఐసీసీ ఆలోచించింది. దీని ప్రకారం ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12 పరుగులు వస్తాయి.
చివరగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో.. ఒకే పాయింట్లతో నిలిచిన జట్లు విదేశాల్లో చేసిన పరుగులను లెక్కించి ర్యాంకింగ్స్ ప్రకటించనున్నారు. ఏప్రిల్ 1న ఫూల్స్ డేలో ఇది భాగమేనా... !