టెస్టు జట్టులో తిరిగి స్థానం దక్కించుకునే విషయమై తనకు ఇంకా అవకాశాలు ఉన్నాయని చెప్పాడు ఓపెనర్ శిఖర్ ధావన్. సరైన అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటానని అన్నాడు. ఐపీఎల్ బయోబబుల్ విధానం గురించి మాట్లాడాడు.
"టెస్టు జట్టులో లేకపోయినంత మాత్రాన అవకాశాలను కోల్పోయినట్లు కాదు. గతేడాది రంజీలో సెంచరీ చేసి వన్టేల్లో స్థానం దక్కించుకున్నట్లే అవకాశం వస్తే మళ్లీ రుజువు చేసుకుంటాను. ఉత్తమ ప్రదర్శన చేస్తా. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి బాగా ఆడాలి. అలానే ఎక్కువ పరుగులు చేస్తూ ఫిట్నెస్ నిరూపించుకోవాలి. వీటివల్లే టెస్టుల్లో స్థానం తిరిగి దక్కించుకుంటాను"
- శిఖర్ ధావన్, టీమ్ఇండియా ఓపెనర్
2013లో ఆస్ట్రేలియాపై టెస్టుతో ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు ధావన్. అందులో వేగంగా శతకం కొట్టి ఘనత సాధించాడు. చివరగా 2018 సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో టెస్టు ఆడాడు. మొత్తంగా 34 టెస్టులాడి 2,315 పరుగులు చేశాడు.
నియంత్రణ ఉండాలి
ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ధావన్.. టోర్నీలో పాల్గొనడంలో భాగంగా యూఏఈలో ఉన్నాడు. "బయోబబుల్‌ను నిర్వహించాలంటే కొన్ని సవాళ్లు ఉన్నాయి. కొత్త వారితో మాట్లాడకుండా, సన్నిహితంగా మెలగడం సహా రెస్టారెంట్లకు వెళ్లకుండా ఉండాలి. జనసంచారం ఎక్కువగా లేని ప్రదేశాలనే ఎంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మా ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరినీ ఓ కుటుంబంలా చూసుకుంటుంది. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, మిగిలిన వాళ్లు దీన్ని చూసే దృష్టిని బట్టి ఉంటుంది" అని వెల్లడించాడు.