టీమ్ఇండియాకు తన సారథ్యంలో ప్రపంచకప్‌ను తెచ్చిన పెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రస్తుతం ఉన్న ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శం. ఈ క్రమంలో మాట్లాడిన అండర్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్.. బ్యాటింగ్, కెప్టెన్సీల్లో కచ్చితంగా మహీ అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రపంచకప్‌లో ప్రియమ్ సారథ్యంలో భారత బృందం ఫైనల్ వరకు వెళ్లింది. కానీ కప్పు సాధించలేకపోయింది.

"నేను ధోనీ సర్‌ను అనుసరిస్తా. అతనే నాకు ప్రేరణ. బ్యాటింగ్, కెప్టెన్సీ విషయానికి వస్తే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తా. ప్రశాంతంగా ఉండటం, పరిస్థితులను అనుగుణంగా ఎలా నడుచుకోవాలో మహీ సర్ నుంచి నేర్చుకున్నా. ఆయన బ్యాటింగ్‌ను కొన్ని వీడియోల ద్వారా చాలా క్షుణ్నంగా గమనించా. ఆయన కెప్టెన్సీ, బ్యాటింగ్, ఫీల్డింగ్ సెట్టింగ్ నైపుణ్యంతో ఆటను మనవైపు తిప్పిన మ్యాచ్‌ల వీడియోలను చూస్తుంటా"
ప్రియమ్ గార్గ్, భారత క్రికెటర్
కొన్ని పరిస్థితుల్లో మ్యాచ్ చేజారిపోయిందని అనుకున్న సమయాల్లో ధోనీ గెలుపువైపు నడిపించడం అద్భుతమని ప్రియమ్ పేర్కొన్నాడు. "చాలా సార్లు టీమ్ఇండియా 100 పరుగులలోపే 5 వికెట్లు కోల్పోవడం మనం చూశాం. ఆ తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు దిగి స్కోరును 250 వరకు తీసుకెళ్తాడు. పాకిస్థాన్‌పై అతను ఆడే మ్యాచ్‌లు అంటే నాకు చాలా ఇష్టం" అని ఈ యువక్రికెటర్ వెల్లడించాడు.