టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్. సహజంగా అతడిపై ఏ బౌలరైనా ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటాడు. ఆ కోవలోనే చేరాడు పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా. అత్యుత్తమ ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుందని తెలిపాడు.
"కోహ్లీని గౌరవిస్తా.. కానీ భయపడను. అత్యుత్తమ ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. అప్పుడే మన ఆటను మెరుగుపర్చుకోవచ్చు. ఎప్పుడు అవకాశం వచ్చినా కోహ్లీతో పాటు టీమ్‌ఇండియాతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా."
-నసీమ్ షా, పాక్ యువ పేసర్
అలాగే భారత్-పాక్ మ్యాచ్ గురించి మాట్లాడాడు నసీమ్. అలాంటి మ్యాచ్‌లు ఎప్పుడో ఒకసారి జరుగుతాయి కాబట్టి అవి ప్రత్యేకమైనవని చెప్పాడు.
![భారత్-పాక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/793299-792360-ind-v-pak-afp_0106newsroom_1591001395_363.jpg)
"భారత్-పాక్ మ్యాచ్ అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. నేనింతకు ముందే ఒక విషయం చెప్పాను. అలాంటి మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు హీరోలవ్వచ్చు, విలన్లు అవ్వచ్చు. అలాంటి మ్యాచ్‌లు ఎప్పుడో ఒకసారి జరుగుతాయి కాబట్టి అవి చాలా ప్రత్యేకం. భారత్‌తో తలపడే అవకాశం వస్తే పాక్ అభిమానులను ఏమాత్రం నిరుత్సాహపర్చను. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తా."
-నసీమ్ షా, పాక్ యువ పేసర్
ఈ ఏడాది ఫిబ్రవరి 10న రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు సాధించి చరిత్ర సృష్టించాడు నసీమ్. టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత అందుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. నసీమ్.. 16 ఏళ్ల 359 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. దీంతో పాక్ తరఫున హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. గతంలో మహ్మద్ సమి, అబ్దుల్ రజాక్, వసీం అక్రమ్ మాత్రమే ఈ రికార్డు నెలకొల్పారు. అలాగే గతేడాది శ్రీలంకతో జరిగిన కరాచీ టెస్టు మ్యాచ్‌లోనూ అతడు ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. అలాంటి యువ సంచలనం ఇప్పుడు భారత్‌తో తలపడేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
![భారత్-పాక్ మ్యాచ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/nintchdbpict000329054981-e1524819065418_0106newsroom_1591001395_138.jpg)