ఆస్ట్రేలియాతో వన్డేలో 435 పరుగుల ఛేదనలో, 175 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హర్షెల్లే గిబ్స్.. ఆ మ్యాచ్‌లో ఉపయోగించిన బ్యాట్‌ను వేలానికి ఉంచాడు. వచ్చిన డబ్బును కరోనాపై పోరాటానికి విరాళంగా అందించనున్నాడు.
2006 జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 434 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ముందుంచింది. అనంతరం విజృంభించిన ఆతిథ్య జట్టు.. 438 పరుగులు చేసి, లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఇన్నేళ్లయినా ఆ రికార్డు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అయితే ఆ మ్యాచ్‌లో రెచ్చిపోయిన గిబ్స్.. కేవలం 111 బంతుల్లో 175 పరుగులు రాబట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ విషయమై ట్వీట్ చేసిన గిబ్స్.. "438 పరుగుల ఛేదనలో నేను ఉపయోగించిన బ్యాట్‌ను వేలానికి ఉంచుతున్నా. ఇన్నాళ్ల నుంచి ఆ బ్యాట్‌ను నా వద్దే భద్రంగా ఉంచుకున్నా" అని వెల్లడించాడు.
కొవిడ్-19పై పోరులో భాగంగా తమ దేశానికి సహాయం అందించేందుకు పలువురు క్రీడాకారులు ముందుకొస్తున్నారు. 2016లో ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్ సందర్భంగా సెంచరీలు చేసి జట్టును గెలిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లు ఏబీ డివిలియర్స్, కోహ్లీలు ఆ మ్యాచ్ కిట్లను ఏప్రిల్ 27 నుంచి వేలానికి ఉంచారు. సేకరించిన డబ్బును దక్షిణాఫ్రికా, భారతదేశంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అందించనున్నట్లు డివిలియర్స్ పేర్కొన్నాడు.