టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడైనా అవలీలగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. ఇప్పటికే క్రికెట్‌లోని అత్యధిక రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. వరుసగా మూడేళ్లు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచాడు. అంత గొప్ప ఆటగాడిని ఒక సాధారణ బ్యాట్స్‌మన్‌గా భావించినట్లు పాక్ పేసర్ జునైద్ ఖాన్ అన్నాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2012లో పాక్.. భారత పర్యటన సందర్భంగా కోహ్లీని జునైద్ మూడుసార్లు ఔట్ చేసిన విషయంపై వ్యాఖ్యాత ప్రశ్నించాడు. దానికి స్పందిస్తూ జునైద్ ఈ విధంగా స్పందించాడు.
మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియా సారథి అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పాడు. ఎవర్ని అడిగినా.. బాబర్ అజామ్, జోరూట్, విలియమ్సన్, స్టీవ్‌స్మిత్ లాంటి ఆటగాళ్లు ఈ తరంలో మంచి బ్యాట్స్‌మెన్ అంటారన్నాడు. వారందరిలో కోహ్లీ ఉత్తమ ఆటగాడని పేర్కొన్నాడు. అయితే, ఆ పర్యటన కన్నా ముందే తాను దేశవాళీ క్రికెట్ ఆడానని, అప్పుడు బాగా సాధన చేయడం వల్ల టీమ్‌ఇండియా పర్యటనలో రాణించానని చెప్పాడు.
ఆ పర్యటన ద్వారానే తాను వన్డేలకు తిరిగొచ్చినట్లు వెల్లడించాడు జునైద్. అప్పుడు మంచి ప్రదర్శన చేయడం చాలా ముఖ్యమని, భారత్‌లో వికెట్లు పడగొడితే ఆ తర్వాత కూడా అలాగే కొనసాగాలనే విషయం తనకు తెలుసని చెప్పాడు.
ఈ నేపథ్యంలోనే తాను కోహ్లీకి తొలి బంతి వేసినప్పుడు అది వైడ్‌గా పడిందని, తర్వాతి బంతిని కోహ్లీ ఆడకపోయేసరికి అతడు సాధారణ బ్యాట్స్‌మన్ అనుకున్నానని జునైద్ వ్యాఖ్యానించాడు. ఇక సిరీస్ కన్నా ముందు అతడు తనతో సరదాగా మాట్లాడినట్లు పాక్ పేసర్ వెల్లడించాడు. "ఇవి భారత పిచ్‌లు ఇక్కడ నీ ప్రభావం ఉండదు" అని కోహ్లీ చెప్పగా తాను కూడా ధీటుగా బదులిస్తూ.. "చూద్దాం నేను కూడా మంచి ఫామ్‌లో ఉన్నా" అని అన్నట్లు జునైద్ పేర్కొన్నాడు.