హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ మాట నెగ్గించుకున్నారు. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్‌వర్మను నియమించారు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీపక్‌వర్మ నియామకానికి ఆమోదముద్ర లభించింది. మార్చి 28 నాటి ఏజీఎంకు కొనసాగింపుగా ఆదివారం నిర్వహించిన సమావేశం కూడా రసాభాసగా ముగిసింది.
జస్టిస్ దీపక్‌వర్మ నియామకం విషయంలో తెలంగాణ హైకోర్టు విజయానంద్‌కు రూ.25,000 జరిమానా విధించిన నేపథ్యంలో వేదికపై కూర్చునే అర్హత కార్యదర్శికి లేదంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీపక్‌వర్మ నియామకాన్ని సమర్థించి ఇప్పుడు వ్యతిరేకిస్తున్న విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేశ్‌శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్ తక్షణం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఈ గొడవ అనంతరం అజహర్ అంబుడ్స్‌మన్‌గా దీపక్‌వర్మను నియమిస్తూ ఎపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలపాలంటూ ఏజీఎంను కోరాడు. సుమారు 184 మంది సభ్యులు హాజరైన సమావేశంలో అత్యధికులు ఇందుకు ఆమోదం తెలిపారు. దీంతో దీపక్‌వర్మ నియామకం పూర్తయినట్లు అజహర్ ప్రకటించారు.
అయితే వేదికపైనే ఉన్న విజయానంద్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే అజహర్ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం వల్ల సభ్యులంతా అవాక్కయ్యారు. ఇదేమీ పట్టించుకోని అజహర్ సమావేశం ముగిసిందని ప్రకటించారు. అజహర్ వెళ్లిన తర్వాత ఎపెక్స్ కౌన్సిల్‌లోని మిగతా సభ్యులు వేదిక మీదే కూర్చున్నారు. మరికొందరు సభ్యులతో కలిసి జస్టిస్ నిసార్ అహ్మద్ కుక్రూను అంబుడ్స్‌మన్‌గా ప్రకటించారు.