మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు వెళ్లాలంటే ఎవరికీ ఫ్రీ పాస్‌లుండవని ప్రముఖ వ్యాఖ్యాత హర్షాభోగ్లే అన్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో టీమిండియా తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే గురువారం జరగాల్సిన భారత్, ఇంగ్లాండ్ సెమీస్ వర్షం కారణంగా రద్దయింది. ఒక్క బంతైనా ఆడకుండానే భారత్ ఫైనల్‌కు చేరింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పోటీపడ్డ దక్షిణాఫ్రికా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా సఫారీలు.. టోర్నీ నుంచి నిష్క్రమించారు.
ఇవీ సఫారీ సారథి వ్యాఖ్యలు
సెమీస్‌లో ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా జట్టు సారథి డేన్ వాన్ నీకెర్క్ మాట్లాడుతూ... టీమిండియాను పరోక్షంగా విమర్శించింది. ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడానికి తాను ఉచిత పాస్ సాధించడం కన్నా ఓటమినే ఎదుర్కొంటానని చెప్పింది. ఇది హర్మన్‌ప్రీత్ సేనను పరోక్షంగా ఎద్దేవా చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
భారత్ మహిళా జట్టు.. గ్రూప్ దశలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంకలపై అద్భుత విజయాలు సాధించింది. ఫలితంగా గ్రూప్-ఏలో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇంగ్లాండ్.. గ్రూప్-బిలో 6 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ రెండు జట్లు తొలి సెమీస్‌లో తలపడాల్సి ఉండగా మ్యాచ్ రద్దయి భారత్‌కు కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా కెప్టెన్ చేసిన వ్యాఖ్యలపై హర్షాభోగ్లే ట్విట్టర్లో దీటుగా స్పందించాడు.
" వర్షం వల్ల ప్రభావితమైన సెమీఫైనల్‌లో ఆడాలా లేకుంటే ఫ్రీ పాస్ తీసుకోవాలా అనేది నీ చేతుల్లో లేదు. అలాగే టీమిండియా ఫైనల్‌కు చేరడం ఫ్రీ పాస్ పొందడం కాదు. గ్రూప్ దశలో అద్భుతంగా రాణించినందుకు వారికి దక్కిన గౌరవం"
-- హర్షాభోగ్లే, ప్రముఖ వ్యాఖ్యాత
వర్షం కారణంగా సెమీఫైనల్ రద్దవడం, మ్యాచ్ ఆడకుండానే ఫలితం రావడం దురదృష్టకరమని మ్యాచ్ అనంతరం మాట్లాడింది టీమిండియా కెప్టెన్ హర్మన్. భవిష్యత్తులో రిజర్వ్ డే పై నిర్ణయం తీసుకోవాలని ఐసీసీకి సూచించింది. ప్రపంచకప్ ఫైనల్‌కు ఐసీసీ రిజర్వ్‌డేను కేటాయించిన నేపథ్యంలో.. నాకౌట్లకూ ఇదే నిబంధన అమలు చేయాలని కోరింది.