ఖేల్‌రత్న అవార్డు నామినేషన్స్‌కు కావాల్సిన పత్రాలు ఆలస్యంగా చేరిన కారణంగా క్రికెటర్ హర్భజన్ సింగ్ దాఖలు చేసిన అప్లికేషన్‌ను ఈ ఏడాది తిరస్కరించారు. తను సరైన సమయంలోనే పత్రాలు సమర్పించినా..రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించిందని చెప్పాడు భజ్జీ. ఈ విషయంపై స్పందించిన పంజాబ్ గవర్నమెంట్ తక్షణ దర్యాప్తునకు ఆదేశించింది. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులను కోరింది.
ఈ విషయం ఎవరి పొరపాటు వల్ల జరిగిందో తెలపాలని పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రానా గుర్మీత్ సింగ్‌ను కోరాడు హర్భజన్. ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడీ మాజీ క్రికెటర్.
"పంజాబ్ ప్రభుత్వానికి నా ఖేల్ రత్న అవార్డుకు సంబంధించిన పత్రాలు మార్చి 20వ తేదీనే పంపాను. అక్కడి నుంచి 10-15 రోజుల్లో దిల్లీ చేరుకోవాలి. కానీ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖకు పంపడంలో పంజాబ్ గవర్నమెంట్ ఆలస్యం చేసింది. ఈ కారణంగా ఈ ఏడాది నామినేషన్స్‌కు దూరమయ్యాను." -హర్భజన్ సింగ్, మాజీ క్రికెటర్
టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో మూడో స్థానంలో ఉన్నాడు హర్భజన్ సింగ్. ఖేల్ రత్న అవార్డు కోసం తన అప్లికేషన్‌ను వచ్చే ఏడాది మళ్లీ పంపాలని ప్రభుత్వాన్ని కోరాడు.
ఇది చదవండి: ద్యుతీ చంద్, హర్భజన్ నామినేషన్ల తిరస్కరణ