టెస్టు క్రికెట్‌లో సీనియర్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాను టీమ్‌ఇండియా కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ఓ క్రీడా ఛానెల్లో మాజీ బ్యాట్స్‌మన్ ఆకాశ్‌చోప్రాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో విఫలమైన బెంగాల్ కీపర్.. తర్వాత రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ చెలరేగడం వల్ల జట్టులో సాహా చోటుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంపై సంభాషించిన భజ్జీ, చోప్రా ఏమన్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. పంత్‌కు తోడుగా రెండో కీపర్‌గా టీమ్‌ఇండియా సాహాను కొనసాగించాలా లేక యువ వికెట్‌కీపర్ వైపు మొగ్గుచూపాలా? అని చోప్రా.. హర్భజన్‌ను అడిగాడు.
"ఇది చాలా కష్టమైన ప్రశ్న. కానీ, ఎవరినైనా ఎంపిక చేసుకోవాల్సి వస్తే కచ్చితంగా సాహానే ఎంచుకుంటాను. అతడు జట్టుతో కలిసి చాలా కాలంగా ఆడుతున్నాడు. అతడో అత్యుత్తమ కీపర్ కూడా. మరోవైపు పంత్ బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాడు. అతడు ఆడేకొద్దీ మరింత నైపుణ్యం సాధిస్తాడు. సాహాను కొంతకాలం జట్టుతో కొనసాగించాలి. అతడి వయసు 35 ఏళ్లు దాటిందని తెలుసు. కానీ, చాలా మంది యువకుల కన్నా అతడే అత్యుత్తమం. అలాగే టీమ్‌ఇండియాకు కలిసి వచ్చే విషయం ఏమిటంటే.. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు కూడా కీపింగ్ స్థానం కోసం సిద్ధంగా ఉన్నారు."
- హర్భజన్ సింగ్, టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్
హర్భజన్ మాటలను అంగీకరించిన చోప్రా.. సాహాను టీమ్‌ఇండియాలోకి తీసుకుంటే జట్టు ఎంపికలో తేడా వస్తుందని అన్నాడు. "సాహా లాంటి ఉత్తమ కీపర్ ప్రపంచంలోనే ఉండడని తెలుసు కానీ, అతడిని తీసుకుంటే జట్టు కూర్పులో సమన్వయం లోపిస్తుంది. అప్పుడు ఐదుగురు బౌలర్లతో ఆడే అవకాశం ఉండదు. ఒకవేళ పంత్‌ను కొనసాగిస్తే అన్ని విధాలా సరిపోతాడు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగవచ్చు. కానీ, సాహాను తీసుకుంటే అది కుదరదు. కెప్టెన్ మరోలా ఆలోచించి ఇషాన్ కిషన్‌ను తీసుకుంటే, అతడు బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ రాణిస్తాడు" అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
మరోవైపు ఆస్ట్రేలియా పర్యటన నుంచీ అద్భుతంగా ఆడుతున్న పంత్.. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులోనూ మేటి ఇన్నింగ్స్ ఆడాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో జట్టుకు భారీ ఆధిక్యాన్ని సంపాదించి పెట్టాడు. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 135 పరుగులకు ఆలౌటై ఘోర ఓటమిని మూటగట్టుకుంది.
ఇదీ చూడండి: 'టెస్టుల్లో బెయిర్‌స్టోకు రోజులు దగ్గరపడ్డాయి'