స్పిన్ బౌలింగ్ ఆడటంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సమర్థుడని ప్రశంసించాడు ఆ జట్టు ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. సగం మంది ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రూట్‌లా స్పిన్‌ను ఎదుర్కోలేరని చెప్పాడు.
"స్పిన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ ఇంత సులభమా అనిపించేలా ఆడతాడు రూట్. అతడు స్పిన్‌ను ఎదుర్కొనే విధానం, దానిపై ఆధిపత్యం సాధించడం.. చూడడానికి అద్భుతంగా ఉంటుంది. అది చూస్తే మాకు 'మనం అసలు పనికొస్తామా' అనే భావన కలుగుతుంది (నవ్వుతూ). నాకు తెలిసి సగం మంది ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అతడిలా సమర్థవంతంగా స్పిన్ ఆడలేరు. సిక్స్ కొట్టి రూట్ డబుల్ సెంచరీ చేయడం ఆశ్చర్యంగా ఉంది. అతడు అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు."
-బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్
ప్రతి బాల్‌కు రూట్ వద్ద సమాధానం ఉంటుందని చెప్పాడు స్టోక్స్. అతడు ఆడుతుంటే చూడటం ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నాడు.
అద్భుత ఫామ్‌లో ఉన్న జో రూట్.. భారత్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 218 పరగులు చేశాడు. గత నెల శ్రీలంక పర్యటనలోనూ శతకాలతో రెచ్చిపోయాడు.
తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 555/8 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అయితే రెండో రోజు డిక్లేర్ ఇచ్చే ఉద్దేశం తమకు అసలే లేదన్నాడు బెన్ స్టోక్స్. అలా చేయడం తెలివితక్కువ పని అని అన్నాడు. మూడో రోజు మరో గంట ఆడితే తమ జట్టు సంతోషిస్తుందని చెప్పాడు.
ఇదీ చూడండి: 'రూట్'ను తప్పించడం ఎందుకింత కష్టం!